Visakha Steel Plant Workers Protest : దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో.. స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన నిరసనలు, దీక్షలను ఉద్ధృతం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన దీక్షలు 638 రోజూ కొనసాగుతున్నాయి.
కూర్మన్నపాలెం జంక్షన్‌లో ఉక్కు కార్మికులు నిరసన తెలుపుతున్నారు. సేవ్ వైజాగ్ స్టీల్, విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు . ఈ నిరసనలో ఉద్యోగులతో పాటు కుటుంబసభ్యులు సైతం పాల్గొన్నారు. పోరాటాలతో సాధించుకున్న ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని కోరుతున్నారు. ప్రధాని మోదీ నగరానికి వస్తున్న సందర్భంగా ప్లాంట్‌ను.. ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
స్టీల్‌ప్లాంట్ పోరాట కమిటీ నేతలు అరెస్ట్: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన నిరసనలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు.. స్టేషన్‌కు తరలించారు. నిర్బంధాలు, అణిచివేతలతో విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ఆపలేరని కార్మికులు తేల్చిచెప్పారు. నిరాహార దీక్షలో పాల్గొన్న ఉద్యోగులు, మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరహార దీక్షలకు మద్దతు తెలపడానికి వచ్చిన వివిధ రాజకీయ పార్టీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో దీక్ష శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. విశాఖ ఉక్కు ఉద్యమం ఒక పడి లేచిన కెరటం లాగా ముందుకెళ్తుంది తప్ప.. ఆగదని నినాదాలు చేశారు.
ఇవీ చదవండి: