విశాఖ నగరంలో వివిధ రాష్ట్రాలకు చెందిన విభిన్న కళారూపాలు ఆకట్టుకుంటున్నాయి. గిరిజన కళాకారులు తయారుచేసిన అనేక వస్తువులతో ట్రైఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆది మహోత్సవ్ ప్రదర్శన సందర్శకులతో సందడిగా మారింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గిరిజన ప్రాంత కళాకారులు రూపొందించిన ఉత్పుత్తులు చూసేందుకు, కొనుగోలు చేసేందుకు నగరవాసులు పోటీపడుతున్నారు.
23వ తేదీ వరకు ప్రదర్శన
గిరిజన గ్రామాలు, తండాలకు చెందిన ప్రజలు సహజ సిద్ధంగా తయారు చేసిన వస్తువులు ఎక్కువగా ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. దుస్తులు, ఆభరణాలు, గృహ అలంకరణ వస్తువులు, వంట సామగ్రి, చిరు ధాన్యాలు, ఆయుర్వేద ఔషధాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. బీచ్ రోడ్డులోని వైఎంసీఏకు ఆనుకుని ఉన్న ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆది మహోత్సవం ప్రదర్శన.. ఈ నెల 23 వరకు కొనసాగనుంది. గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనకు విశాఖ వేదిక కావటం ఇదే తొలిసారి.