Government Teacher Murder in Vizianagaram District: విజయనగరం జిల్లా రాజాంలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ(58) దారుణ హత్యకు గురయ్యారు. ఆయన్ను బొలెరో వాహనంతో ఢీకొట్టి హతమార్చి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. రాజాం సీఐ రవికుమార్, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. శనివారం ఉదయం తన ఇంటి నుంచి కృష్ణ ద్విచక్రవాహనంపై బయల్దేరి తెర్లాం మండలం కాలంరాజుపేటలోని పాఠశాలకు వెళ్తున్నారు. ఒమ్మి సమీపంలోని కొత్తపేట వద్ద ప్రత్యర్థి వర్గం బొలెరో వాహనంతో ఆయన్ను ఢీకొట్టింది. దీంతో కృష్ణ కింద పడిపోయి చనిపోయారు. అక్కడి పరిస్థితులను చూసి ఇది హత్యేనని కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఘటనాస్థలం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు విచారణ చేపట్టగా, హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని నిర్ధారణ అయింది. మృతుడి కుమారుడు శ్రావణ్‌కుమార్ ఫిర్యాదు మేరకు ఉద్దవోలుకు చెందిన మరడాన వెంకటనాయుడు, మోహనరావు, గణపతి, రామస్వామిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ రవికుమార్ తెలిపారు.
- ఏడేళ్ల బాలుడి దారుణ హత్య.. యాసిడ్ పోసి.. నాలుక కోసి.. కళ్లు, పళ్లు పీకేసి..
- మందు కోసం గొడవ.. యువకుడ్ని కొట్టిచంపిన తండ్రి, అన్న.. ఇంటి వెనుకే అంత్యక్రియలు
పథకం ప్రకారమే..: టీడీపీలో క్రియాశీలకంగా ఉండే కృష్ణ.. తెర్లాం మండలం ఉద్దవోలుకు 1988 నుంచి 1995 వరకు సర్పంచిగా చేశారు. 1998లో ఆయనకు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. తర్వాత నుంచి గ్రామంలో ఈయన ఎవరికి మద్దతు తెలిపితే వారే సర్పంచిగా గెలిచేవారు. 2021 ఎన్నికల్లో ప్రస్తుత సర్పంచి సునీత ఈయన మద్దతుతో నెగ్గారు. తర్వాత వారిద్దరూ వైసీపీలో చేరారు. అప్పటికే వైసీపీలో ఉన్న వెంకటనాయుడు దీన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో పథకం ప్రకారమే కృష్ణను హత్ యచేసినట్లు ఆయన భార్య జోగేశ్వరమ్మ, కుమారుడు శ్రావణ్‌కుమార్, కుమార్తె ఝాన్సీతో పాటు బంధువులు ఆరోపిస్తున్నారు. కృష్ణను వాహనంతో ఢీకొన్న తర్వాత కొద్దిదూరం ఈడ్చుకెళ్లి రాడ్‌తో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు పోలీసులు వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు.
కక్షలకు కారణం ఇదే: కృష్ణ టీడీపీలో ఉండగా గ్రామానికి ఆనుకుని ఉన్న చెరువు గర్భంలో వెంకటనాయుడు తదితరులు సచివాలయ భవనం, ఆర్బీకే భవనాలు నిర్మించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని గ్రామానికి చెందిన కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పటికే సచివాలయం భవనానికి రూ.12 లక్షలు, ఆర్బీకేకు రూ.6 లక్షలు చెల్లింపులు జరిగాయి. హైకోర్టులో కేసు వేశాక రెండు భవనాల పనులూ నిలిచిపోయాయి. దీనికి కృష్ణే కారకుడని భావించి ఆయనపై వెంకటనాయుడు వర్గానికి చెందిన కొంతమంది డీఎస్సీలో అక్రమంగా ఉపాధ్యాయ పోస్టు సంపాదించారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పరస్పర ఫిర్యాదులు చేసుకుంటూనే ఉన్నారు.