విశాఖ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు దాచిపెట్టి రాజధానిని విశాఖకు తరలించే కుట్ర జరుగుతోందని తెదేపా నేత బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. కరోనా లక్షణాలున్న వారిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలిస్తున్నారన్నారు. ఈ విషయంపై కేంద్రం విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖలో విరాళాల పేరుతో ఎంపీ విజయసాయిరెడ్డి అధికారులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ క్వారంటైన్‌కు పంపకుండా హోం ఐసోలేషన్‌కు పంపడం చూస్తే విశాఖలో సీఎం జగన్ రాజకీయాలు చేస్తున్నట్లు ఉందని విమర్శించారు.
జగన్... కడపకే ముఖ్యమంత్రా?
కరోనా బాధితుల పేర్లు వెల్లడించకూడదనే నిబంధనలతో.. అనుమానిత కేసులను ప్రైవేటు ఆసుపత్రులకు తరలిస్తున్నారని సత్యనారాయణమూర్తి ఆరోపించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కడప అరటి రాష్ట్రం మొత్తం రవాణా చేస్తున్నారన్న ఆయన.. గోదావరి జిల్లాల్లో అరటి కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించారు. జగన్ కడప జిల్లాకే ముఖ్యమంత్రా అని నిలదీశారు.
ఇదీ చదవండి : 'కరోనా వైద్యానికి ప్రైవేటు ఆసుపత్రులూ సిద్ధం'