TDP ANITHA : ఏదైనా విషయాన్ని పక్కదారి పట్టించడంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని తెదేపా మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత రాష్ట్రంలో హైడ్రామా నడుస్తోందని అన్నారు. దిల్లీ లిక్కర్ స్కామ్లో సీఎం సతీమణి భారతి రెడ్డితో పాటు కొంత మంది వైకాపా నాయకుల ప్రమేయం ఉందని, ఈ విషయాన్ని పక్కదారి పెట్టించేందుకే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రికి మించిన నటుడు వేరొకరు లేరని.. రాష్ట్రంలో 15 మెడికల్ కాలేజీలు అనేది ఒక బూటకమని ఆమె మండిపడ్డారు.
సీఎం జగన్కు తండ్రి మీద ప్రేమ ఉంటే.. తల్లి, చెల్లిని పక్క రాష్ట్రానికి ఎందుకు పంపిస్తారని అనిత ప్రశ్నించారు. తన తండ్రిపై ప్రేమ ఉంటే రాష్ట్రంలో కొత్తగా పెడుతున్న 15 మెడికల్ కాలేజీలకు వైఎస్ పేరు పెట్టుకోవాలని సూచించారు. రాజకీయాలలో పెను మార్పులు తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు అని.. షర్మిలకు ఉన్న బుద్ధి , జ్ఞానం సీఎం జగన్కు లేదన్నారు. సీఎం జగన్కు అంతగా వైఎస్సార్ పేరు పెట్టుకోవాలని ఉంటే రాష్ట్రంలో ఉన్న సెంట్రల్ జైలుకు ఆయన పేరు పెట్టుకోవాలని సూచించారు.
విశాఖలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశం పూర్తిగా వైకాపా సమావేశమని.. ఈ సమావేశంలో ఆ పార్టీకి చెందిన వారు తప్ప బయటవారు ఎవరు లేరని ఆరోపించారు. రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా విశాఖకు ఏం చేశారో ఆ పార్టీ నాయకులు సీఎంను అడగాలని.. అమరావతి రాజధాని నిర్మాణానికి డబ్బులు లేవు అన్న సీఎం మూడు రాజధానులు ఎలా ఏర్పాటు చేస్తారని అనిత ప్రశ్నించారు.
ఇవీ చదవండి: