ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం సంగీత ప్రపంచానికే తీరని లోటని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అన్నారు. ఈ సందర్భంగా ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. ఎస్పీ బాలు శివైక్యం పొందడం బాధాకరమన్నారు. సంగీతమే ఊపిరిగా బాలు జీవించారని...విశాఖ శారదా పీఠంతో ఆయనకు మంచి అనుబంధం ఉందన్నారు.
బాలు శ్రీశైలం వెళితే శారదాపీఠం ఆశ్రమంలోనే ఉండేవారని గుర్తు చేసుకున్నారు. గొప్ప ఆధ్యాత్మిక భావాలున్న సంగీత శిఖరం బాలసుబ్రహ్మణ్యమని కొనియాడారు. బాలు ఆత్మ భగవంతుని పాద చరణముల వద్దకు చేరాలని కోరుకుంటున్నానని స్వరూపానందేంద్ర అన్నారు.
కోట్ల హృదయాల్లో ఆయన స్థానం సుస్థిరం..
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం దివికేగడం తీరని లోటని... వేల పాటలతో కోట్ల మంది హృదయాల్లో సుస్ధిర స్ధానం సంపాదించిన ఆయన అజరామరుడని విశాఖలో సాంస్కృతి సంస్ధలు నివాళులు అర్పించాయి. ఆయన కన్నుమూశారన్న విషయం ప్రకటించిన తర్వాత విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఘంటశాల క్రీడా సాంస్కృతిక సంఘం తన సభ్యులందరితో కలిసి సంతాప సమావేశం నిర్వహించింది. సభ్యులంతా అయనకు అంజలి ఘటించి... కొద్దిసేపు మౌనం పాటించారు.
ఇదీ చదవండి: గుండెలకు హత్తుకునే తమ్ముడ్ని కోల్పోయా: రామోజీరావు