భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చుట్టుపక్కల 353.70 చ.కి.మీ. పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక అభివృద్ధి ప్రణాళికను రూపొందించనుంది. ప్రతిపాదిత ప్రాంతం విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో ఉంది. ప్రణాళిక రూపకల్పన బాధ్యతను అహ్మదాబాద్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఎంపిక చేసిన నేపథ్యంలో... ఈ అభివృద్ధి ప్రణాళిక ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, హెచ్‌సీపీ సంస్థ డైరెక్టర్ బిమల్ పటేల్‌తో కలసి ఇటీవల విశాఖ చుట్టుపక్కల పలు ప్రదేశాలను సందర్శించారు. వారు చూసిన ప్రదేశాలన్నీ ‘అభివృద్ధి ప్రణాళిక’ కోసం ఎంపిక చేసిన ప్రాంతంలోనే ఉన్నాయి. దిల్లీలో కేంద్రం చేపట్టిన సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రాజెక్టు డిజైన్లు రూపొందించినదీ హెచ్‌సీపీ సంస్థే. కార్యనిర్వాహక రాజధాని అభివృద్ధిలో భాగంగానే ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు ప్రభుత్వం సంకల్పించిందన్న చర్చ జరుగుతోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యల్ని సూచించేందుకు ప్రభుత్వం నియమించిన జి.ఎన్.రావు కమిటీ కూడా.. విశాఖకు ఉత్తర దిక్కున, విజయనగరం దగ్గర్లో రాజధానిని అభివృద్ధి చేయాలని సిఫారసు చేసింది.
భోగాపురం విమానాశ్రయానికి చుట్టుపక్కల 353.70 చ.కి.మీ. ప్రాంతంలో అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొన్నా... అందులో ఎక్కువ భాగం విశాఖ జిల్లా పరిధిలోనే ఉంది. విశాఖ నగరంలో భాగంగా ఉన్న పోతిన మల్లయ్యపాలెం, మధురవాడ, రుషికొండ, ఎండాడ వంటి ప్రాంతాలు సహా.. విశాఖ, విజయనగరం జిల్లాల్లోని 59 గ్రామాలు అభివృద్ధి ప్రణాళిక రూపొందించే ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతమంతా విశాఖ నగరానికి ఉత్తర దిశగా విస్తరించి ఉంది.
వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో టెండర్లు
ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు కన్సల్టెన్సీ సంస్థ ఎంపిక బాధ్యతను విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) నిర్వహించింది. వీఎంఆర్‌డీఏ మే నెలలో టెండర్లు పిలవగా, అర్హతలు గల సంస్థలు రాలేదు. మళ్లీ రెండోసారి టెండర్లు పిలిచింది. టెక్నికల్ బిడ్‌లో హెచ్‌సీపీతో పాటు, డీడీఎఫ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు అర్హత సాధించాయి. జూన్ 22న ఫైనాన్షియల్ బిడ్ తెరిచిన వీఎంఆర్‌డీఏ.. హెచ్‌సీపీ సంస్థను ఖరారు చేసింది.
- ప్రాజెక్టు ముఖ్యోద్దేశం ఇదీ..
వీఎంఆర్‌డీఏ తన టెండర్ ప్రకటనలో ఈ ప్రాజెక్టు ఉద్దేశాల్ని ఇలా వివరించింది. ‘‘భోగాపురంలో విమానాశ్రయ నిర్మాణం తలపెట్టిన తర్వాత విశాఖ నగరం ఉత్తర దిశగా వేగంగా విస్తరిస్తోంది. పైగా ఈ ప్రాంతం ప్రకృతి అందాలకు నెలవు. పర్యావరణ పరంగానూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన ప్రాంతం. రాష్ట్ర ప్రభుత్వం వీఎంఆర్‌డీఏ పరిధిలో 140 కి.మీ. పొడవున మెట్రో రైల్ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విశాఖ నగరానికి ఉత్తర ప్రాంతం మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశముంది. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులతో ఆ ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలి. అందుకే విశాఖ నగరానికి ఉత్తరాన, భోగాపురం విమానాశ్రయానికి చుట్టుపక్కల ఉన్న సుమారు 360 చ.కి.మీ. పరిధిలో అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించాం. ఈ అభివృద్ధి ప్రణాళికను భవిష్యత్తులో మాస్టర్‌ప్లాన్‌లో అనుసంధానం చేస్తాం’’ అని పేర్కొంది.
ఇదీ చదవండి: