State Government Issued Notice To KR Suryanarayana : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆయన అధ్యక్షుడుగా ఉన్న ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. గతంలో ఆ శాఖ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఆ శాఖ అదనపు కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగటంపై గతంలో ఓ దఫా నోటీసులు జారీ చేసింది.
వివరణ ఇవ్వాలని నోటీసులు : కార్యాలయం వెలుపల ఉన్నతాధికారిని దిగ్భంధించి ఆందోళన చేయటంపై సంజాయిషీ ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం మరోమారు ఆయన అధ్యక్షుడుగా ఉన్న ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు ఎందుకు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ నోటీసు జారీ చేశారు.
గోడ పత్రికలను విడుదల చేసిన బొప్పరాజు : తమ సమస్యలను నెరవేర్చాలని కోరుతూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఏపీ జేఎసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉద్యోగులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఉద్యోగుల సమస్యలపై రూపోందించిన గోడ పత్రికలను విడుదల చేశారు.
విశాఖలో 'ఉద్యోగుల ఉప్పెన' బహిరంగ సభ : మే ఒకటిన 'ఉద్యోగుల ఉప్పెన' పేరుతో విశాఖలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రతి నెలా ఒకటవ తేదీన జీతాలను చెల్లించడం లేదని కాలయాపన చేస్తున్నారు తప్ప న్యాయమైన డిమాండ్లను తీర్చడంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగుల పట్ల మంత్రులు హేళనగా మాట్లాడం తగదని ఆయన అన్నారు. ప్రభుత్వానికి సమయమిచ్చామని స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉదృతం చేస్తామన్నారు.
పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ : మరో పక్క ఏపీ జేఏసీ అమరావతి పిలుపు మేరకు.. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ముందు ప్రభుత్వ ఉధ్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు కీలక విషయాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. అందులో ముఖ్యంగా సీపీఎస్‌ను రద్దు చేయాలని, పాత పింఛన్ విధానాన్నే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు.
దశల వారీగా ధర్నాలు, ఉద్యమాలు : ప్రభుత్వంలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అన్నారు. ఇప్పటికే ఈ విషయాలపై పలుమార్లు ప్రభుత్వానికి విన్నపాలు చేసినా ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఏపీ జేఏసీ అమరావతి పిలుపు మేరకు దశల వారీగా ఉద్యమాలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇవీ చదవండి