St Luke Minority Educational Society Frauds: విశాఖ సాగర తీరం సమీపాన 'సెయింట్ లూక్స్ మైనార్టీ ఎడ్యుకేషనల్ సొసైటీ' పని చేస్తోంది. ఎటువంటి లాభాపేక్ష లేని సంస్థ. క్రిస్టియన్ కమ్యునిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళల సాధికారిత కోసం నర్సింగ్ ద్వారా శిక్షణ ఇస్తామని, దీనికి అవసరమైన స్థలం కేటాయించాలని, ఆసుపత్రి నిర్మాణం, మౌలిక వసతులు, శిక్షణ తరగతులు నిర్మించాల్సి ఉన్నందున ఇచ్చే భూమిని తక్కువ ధరకు ఇవ్వాలని.. పేదల వైద్య అవసరాలు తీర్చే విధంగా ఆసుపత్రిని నడిపి సమీప గ్రామాలలో.. పునరావాస కేంద్రాలు, మందుల పంపిణీ, వైద్యశిబిరాల నిర్వహణ వంటివి ఏర్పాటు చేస్తామని.. ఈ సంస్ధ 2004లో ప్రభుత్వానికి చేసిన దరఖాస్తు తీరు. ఈ సేవలు అందిస్తారని 2009లో ఫిబ్రవరి 20న స్థలం కేటాయిస్తూ.. అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సేవ పేరుతో ఎకరా రూ.25 లక్షలకే.. తొలి దరఖాస్తు 2004 చేయగా.. 2006లో క్యాబినెట్ ఈ తీర్మానంను తిరస్కరించింది. వైఎస్ సన్నిహితుల సహకారం ఉండటంతోనే దస్త్రం ముందుకు కదిలి విలువైన భూమిని కేటాయించినట్లు అప్పట్లో విమర్శలున్నాయి. దానిపై కలెక్టర్ నివేదిక ఇస్తూ అందులో భూమి అప్పటి మార్కెట్ విలువ ఎకరా రూ.1.50 కోట్లుగా పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా అడుగులు పడటంతో.. సేవ పేరుతో ఎకరా రూ.25 లక్షలకే కట్టబెట్టారు. భూపరిపాలన శాఖ నిర్ణయం తీసుకుని సొసైటీకు విశాఖ గ్రామీణ మండలం ఎండాడ రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 16/1లో 7.35 ఎకరాలు కేటాయించారు. ఈ భూమి జాతీయ రహదారి ఆనుకుని ఉండటంతో దీని విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.300కోట్లు పైమాటే.. వెనక్కి తీసుకోవాలని సూచించినా.. ప్రభుత్వం నుంచి ఓ లక్ష్యంతో తీసుకున్న భూమి వినియోగంలో నిబంధనలకు పాతరేశారు.
రేకుల షెడ్లో శిక్షణ.. కేటాయించిన భూమిలో కొంత రోడ్డు విస్తరణకు పోగా.. 6 ఎకరాలపైగా సంస్థ ఆధీనంలో ఉంది. ఇందులో కేవలం కొంత భాగంలో మూడు రేకుల షెడ్లు నిర్మించి నర్సింగ్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే నర్సింగ్ విద్యార్థినులకు వసతి గృహం ఏర్పాటు చేశారు. తాజాగా మ్యూజిక్, యోగ శిక్షణ ఇచ్చేందుకు ఏయూతో కలిసి అడుగులు పడ్డాయి. ప్రధానంగా ఆసుపత్రి భవనం నిర్మించి ఉచిత వైద్య సేవలందిస్తామన్న ఉద్దేశ్యం పూర్తిగా నీరుగారింది. వాస్తవానికి భూమి కేటాయించిన తర్వాత నిర్దేశిత సమయంలో సేవలు అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. అయితే పద్నాలుగేళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో లక్ష్యం నెరవేరకపోగా, ఖాళీగా విలువైన భూములు చేతుల్లో పెట్టుకోవడం గమనార్హం. ఇదే విషయంపై కొన్నేళ్ల క్రితం ఖాళీ భూములు వెనక్కి తీసుకోవాలంటూ ప్రభుత్వానికి అప్పట్లో వేసిన కమిటీ సూచన చేసింది.
ఇది నిజం చేస్తూ విమలారెడ్డి పర్యటనలు.. పేదల ఆసుపత్రి భవన నిర్మాణం చేయడానికి లూజ్ సాయిల్ (మట్టి స్వభావం) సరిగా లేదన్న సాకు చూపుతున్నారు సంస్థ నిర్వహకులు. డాక్టర్ లూక్స్ మెమోరియల్ చర్చి మాత్రం ఎప్పుడో నిర్మించేశారు. దరఖాస్తులో లేని చర్చిని ఏర్పాటు చేసి, వైఎస్ సోదరి విమలారెడ్డి ఇక్కడ మత సందేశం ఇవ్వడానికి మాత్రం తరుచూ వస్తున్నట్లు సమాచారం. వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ నేతల ఆస్తులు.. నిబంధనల ఉల్లంఘన పేరుతో ఉక్కుపాదం మోపింది. ఇక్కడ లక్ష్యంకు విరుద్ధంగా భూవినియోగం జరుగుతున్నా పట్టించుకోకపోడం గమనర్హం. దీనిపై సొసైటీ కరస్పాండెంట్ ప్రీతం లూక్స్ ఆసుపత్రి, ఇతర భవన నిర్మాణాల అనుమతులకు రెండు, మూడు సార్లు దరఖాస్తు చేసినా అనుమతులు లభించకపోవడంతో ఆలస్యమైంది. అయినప్పటికీ వైద్య సేవలు తాత్కాలికంగా అందిస్తూ, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఇవీ చదవండి: