Srikalahasti pala kova: తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి అంటే గుర్తొచ్చేది.. అక్కడి శ్రీకాళహస్తిశ్వరుడి ఆలయం. కానీ అక్కడికి వెళ్లిన వారికి ఎప్పటికీ గుర్తుండిపోయేది మరొకటి ఉంది. అదే పాలకోవా. ఆ కోవా రుచి చూసిన వారెవరూ దాన్ని మరచిపోలేరు. శ్రీకాళహస్తి పాలకోవా... దాదాపు 7 దశాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉంది. పరిసర ప్రాంతాల్లోని పాడి రైతుల నుంచి సేకరించిన పాలతో దీనిని తయారుచేస్తారు. కేవలం పాలు, చక్కెరతో... యంత్రాల సాయం లేకుండా చేతులతో తయారుచేసే ఈ కల్తీలేని కోవా అంటే... సామాన్యులకే కాదు ఎంతో మంది ప్రముఖులకూ చాలా ఇష్టం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోనూ... శ్రీకాళహస్తి పాలకోవాపై ఓ డైలాగ్ వాడారు. చిత్ర బృందం... కాళహస్తికి వచ్చి మరీ ఇక్కడి పాలకోవాను తీసుకెళ్లారు..
"43 గ్రామాలలో నేరుగా రైతుల దగ్గర నుంచే పాలను సేకరిస్తాము. ఇందులో 1000లీటర్ల పాలను కోవా, ఐస్‌క్రీమ్, భాసంతి తయారీకి ఉపయోగిస్తాము. పాలకోవాను మెషిన్స్తో కాకుండా మ్యాన్యువల్‌గా తయారుచేయటం ద్వారా కోవా బాగా రుచికరంగా వస్తుంది." -మధుసూదనరావు, ఛైర్మన్, శ్రీకాళహస్తి పాల సరఫరా సంఘం
శ్రీకాళహస్తి పాలకోవాకు తెలుగు రాష్ట్రాలతోపాటు.. కర్ణాటక, తమిళనాడులోనూ మంచి గిరాకీ ఉంది. డిమాండ్‌ను బట్టి.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకూ ఇక్కడి పాలకోవాను రవాణా చేస్తున్నారు నిర్వాహకులు. ఒక్కసారి ఈ కోవా రుచి చూసినవారు.. మళ్లీ మళ్లీ ఆస్వాదించాలనుకుంటారు.
"పుష్ప సినిమా షూటింగ్ సమయంలో.. చిత్ర బృందంలో 20 మంది వరకు మా షాప్‌కు వచ్చి ఐస్‌క్రీమ్ కోవా తిన్నారు. చాలా బాగుందని చెప్పి 10కేజీల పాలకోవాను ప్యాక్ చేసుకుని తీసుకెళ్లారు. చిత్ర బృందం పాలకోవా ఫొటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన తరువాత మంచి ఆధరణ లభించింది. రోజూ పాలకోవాను సాయంత్రం 3గంటల వరకు అమ్మే మేము.. పుష్ప సినిమా ఎఫెక్ట్‌తో మధ్యాహ్నం 12గంటలకే పాలకోవా అయిపోతుంది." -మునిరాజయ్య, మేనేజర్, శ్రీకాళహస్తి పాల సరఫరా సంఘం
ఇవీ చదవండి: