విశాఖ జిల్లాలోని సింహాచలం అడివివరం సహకార పరపతి సంఘంలో పలు రికార్డులు ట్యాంపరింగ్‌కు గురయ్యాయని జిల్లా సహకార అధికారి దుర్గాప్రసాద్ ఫిర్యాదు చేసినట్లు గోపాలపట్నం సీఐ మళ్ల అప్పారావు తెలిపారు. సంఘం ప్రస్తుత అధ్యక్షుడు కర్రి అప్పల స్వామి, డైరెక్టర్ బంటుబిల్లి మహేశ్వరరావులపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
అసలేమైంది..?
అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి, డైరెక్టర్ బంటుబిల్లి మహేశ్వరరావు 2012 లో సంఘానికి సంబంధించిన పలు రికార్డులను ట్యాంపరింగ్ చేసి అవకతవకలకు పాల్పడ్డారని సంఘం పూర్వపు అధ్యక్షుడు వరదా నరసింహమూర్తి, డైరెక్టర్ దాసరి కనకరాజు 2019 లోనే జిల్లా సహకార అధికారికి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ప్రస్తుత అధ్యక్షుడు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. 2010 లో సంఘానికి సంబంధించి కొంత మొత్తాన్ని మరో ప్రైవేటు సొసైటీలో డిపాజిట్ చేసిన అంశానికి సంబంధించిన వ్యవహారంలో.. ట్యాంపరింగ్ జరిగినట్లు ఫిర్యాదిదారులు ఆరోపిస్తున్నారు.
ఆరోపణలు అవాస్తవం.. విచారణకు సిద్ధం
రికార్డులు ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలు అవాస్తవమని సహకార సంఘం అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి, డైరెక్టర్ బంటుబిల్లి మహేశ్ అన్నారు. గత ఫిర్యాదులకు సంబంధించిన కేసు హైకోర్టులో విచారణలో ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. వ్యాజ్యం నడుస్తుండగా మరోసారి ఫిర్యాదు చేయడం సరికాదన్నారు. తమపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి విచాణకైనా సిద్ధమని వారు అంటున్నారు.
ఇవీ చదవండి: