విశాఖ జిల్లాలోని సింహాచలంలో కొలువుదీరిన శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారికి ఈనెల 16 నుంచి వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈనెల 16న ప్రారంభమైన ఈ ఉత్సవాలు 20న ఏకాంత స్నపనంతో పరిసమాప్తమవుతాయని వివరించారు.
శ్రీ స్వామి వారి ఉత్సవమూర్తులైన త్రిగోవిందరాజస్వామి, అమ్మవార్లు కళ్యాణ మండపంలో విశేష ఉత్సవము జరుగుతాయని అర్చకులు తెలిపారు. ఈ పవిత్రోత్సవాల్లో విశేష హోమాలు, వేదపారాయణలు, దివ్య ప్రబంధ సేవాకాలము, తిరునిధి ఉత్సవములు జరుగుతాయని వివరించారు. ఈ కాలంలో ఉదయం ఆరాధన తర్వాత విశేషమైన హోమాలు, పూర్ణాహుతి జరుగుతాయని అర్చకులు తెలిపారు. పవిత్ర అలంకృతుడైన స్వామి వారిని సేవించిన భక్తులు ఆయన అనుగ్రహం పొందుతారన్నారు.
పవిత్రోత్సవాల సందర్భంగా ఈనెల 16 నుంచి 20 వరకు స్వామి వారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలు, నిత్య కళ్యాణం రద్దు చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. రాత్రి 7 గంటల తరువాత భక్తులకు దర్శనం ఉండదని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి : ఒడిశా తీరంలో చిక్కుకున్న విశాఖకు చెందిన 30 మత్స్యకార బోట్లు