పెందుర్తి లక్ష్మీనగర్ వద్ద 25 టన్నులతో వెళ్తున్న లారీని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులు గుర్తించి రికార్డులు పరిశీలించారు. జ్ఞానాపురం వెళ్లాల్సిన ఇసుక.. లక్ష్మీనగర్‌కు వెళ్తున్నట్లు గుర్తించారు. బల్క్ బుకింగ్‌లో భాగంగా ఆన్‌లైన్‌లో జీవీఎంసీ కమిషనర్, జేసీలు ధ్రువీకరించినట్లుగా ఇసుక వర్క్ ఆర్డర్‌ను పొందుపరిచారు. దీనిపై జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులను విచారించగా, తాము వర్క్ ఆర్డర్ ఇవ్వలేదన్నారు.
ఎన్.కుమార్‌స్వామి, ఎన్.సాయిరాజు అనే వ్యక్తులు ఉన్నతాధికారుల సంతకాలతో నకిలీ వర్క్ ఆర్డర్‌ను సృష్టించినట్లు గుర్తించారు. ఈ వర్క్ ఆర్డర్‌తో ఆగస్టు 17న 500 టన్నులు బుక్ చేసి, రూ.1,87,500 చెల్లించి, ఇసుకను పక్కదారి పట్టించారు. సెప్టెంబరు 14న మరో 500 టన్నుల బుక్ చేసి, వీరి స్నేహితుడు రామరాజుకు టన్ను రూ.500కు కేటాయించగా, అతను ఇతరులకు టన్ను రూ.1,200 చొప్పున రవాణా చేసినట్లు గుర్తించారు. కుమారస్వామి, సాయిరాజులను ఏయూ అవుట్‌గేటు వద్ద అరెస్టు చేసి, వారి నుంచి ఫోర్జరీకి వినియోగిస్తున్న పత్రాలు, ల్యాప్‌టాప్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
కల్తీ చేస్తూ...అమ్మేస్తూ
తిక్కవానిపాలెంలో సముద్రపు ఇసుక దిబ్బలను తవ్వి తరలిస్తున్నారు. దీనిని రాజమహేంద్రవరం నుంచి వస్తున్న ఇసుకలో కలిపి విక్రయిస్తున్నట్లు సమాచారం. శనివారం దిబ్బలను తవ్వుతున్న సమయంలో స్థానికులు అడ్డుకుని అధికారులకు సమాచారం అందించారు. తహసీల్దార్ బీవీ. రాణి ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సత్తిబాబు, వీఆర్వోలు లారీతో పాటు జేసీబీ యంత్రాన్ని స్వాధీనం తీసుకున్నారు. సీఐ ఉదయ్‌కుమార్ తవ్వకాల ప్రదేశాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీపీ అప్పలనాయుడు, తదితరులు ఇసుక తవ్వుతున్న ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు వివరాలు తెలియజేశారు.
కొన్న ప్రాంతానికి కాకుండా మరో చోటుకు రవాణా
అగనంపూడి టోల్‌గేటు వద్ద 30 టన్నుల ఇసుకతో ఉన్న 2 లారీలను తనిఖీ చేయగా, బిల్లుపై ఉన్న ప్రాంతానికి కాకుండా ఇతర ప్రాంతాలకు ఇసుక వెళ్తున్నట్లు గుర్తించారు. ఎన్.ఈశ్వరరావు, కోటేశ్వరరెడ్డిలు శ్రీమారుతీ లాజిస్టిక్స్ పేరిట ఇసుకను బల్క్‌గా బుక్ చేసి టన్ను రూ.1,550 చొప్పున ఇతరులకు విక్రయిస్తున్నట్లు తెలుసుకున్నారు. శ్రీసాయి పవన్ ప్రమోటర్స్, అభిరామ నిర్మాణ్ కంపెనీలకు ఇసుకను సప్లై చేస్తున్నట్లు చూపించి, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వీరు తూర్పుగోదావరి జిల్లా ములకలంక రీచ్ నుంచి ఇసుకను తెప్పిస్తున్నారు. వారిద్దరితో పాటు 10 మందిని అరెస్టు చేసి, 6 లారీలను స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ ధ్రువీకరణ పత్రాలతో
మిథిలాపురి కాలనీలో దాడులు జరిపిన సమయంలో మధురవాడకు చెందిన లారీ యజమాని బీ.సురేష్‌కుమార్, డ్రైవర్ వీ.రామును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. లారీలో 25 టన్నుల ఇసుకను రాంబిల్లి తరలిస్తున్నట్లు గుర్తించారు. వీటి వివరాలను సేకరించగా, ఎండాడకు చెందిన కె.సాయివివేక్ ఇసుకను పి.నర్సింగనాయుడుకు చెందిన ఎస్.ఎ. కన్‌స్ట్రక్షన్స్ పేరిట ఉన్న జీఎస్టీని ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఇసుకను బల్క్ బుకింగ్ చేసినట్లుగా గుర్తించారు. రాంబిల్లి నేవల్ ఆర్మ్‌డ్ ఆపరేటింగ్ బేస్‌కు ఇసుక కోసం తమకు సంబంధం లేని నకిలీ పత్రాలతో 1200 మెట్రిక్ టన్నులు, 990 మెట్రిక్ టన్నులు, 900 మెట్రిక్ టన్నుల ఇసుకను ఆగస్టులో బుక్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేశారు.
విజయనగరమని చెప్ఫి.. విశాఖకు
తగరపువలస కూడలిలో 25 టన్నులతో వస్తున్న లారీని తనిఖీలు చేయగా, విజయనగరం వెళ్లాల్సిన లారీ విశాఖకు వస్తున్నట్లు గుర్తించారు. లారీ డ్రైవర్ రామకృష్ణను విచారించారు. విజయనగరం జిల్లా దతిరాజేరు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన హరవమ్మ అనే వ్యక్తి ఈ ఇసుకను బుక్ చేసినట్లు తెలుసుకున్నారు. వియ్యపు వెంకటరావు పేరిట విజయనగరం ప్రేమ్ శంకర్ రాథి, మహాలక్ష్మీనగర్, విజయనగరం చిరునామాకు రూ.375 చొప్పున శ్రీకాకుళంలో ఇసుకను బుక్ చేసినట్లు గుర్తించారు. అయితే విజయనగరం చిరునామాకు తీసుకువెళ్లాల్సిన ఇసుకను విశాఖకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. హరివమ్మను విజయనగరంలో అరెస్టు చేసినట్లు తెలిపారు.
విశాఖ నగర పరిధిలో ఎస్‌ఈబీ ద్వారా ఇప్పటి వరకు 125 కేసులు నమోదు చేసి, 115 మందిని అరెస్టు చేశారు. 2,563 టన్నుల ఇసుకను, 116 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువ మొత్తంలో బుకింగ్ చేసుకున్న ఇసుక రవాణా వాహనాలను శాండ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఎక్కడికి వెళ్తున్నాయో పరిశీలిస్తూ నిఘా ఉంచుతున్నారు.
ఇవీ చదవండి..