న్యాయస్థానాలను ఉద్దేశించి శాసనసభాపతి తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ సబ్బం హరి తీవ్రంగా తప్పుబట్టారు. బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి... కోర్టు విధివిధానాలపై మాట్లాడటం తగదని హితవు పలికారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనన్ని ఉల్లంఘనలను వైకాపా సర్కారు చేస్తోందని ఆయన విమర్శించారు. తిరిగి కోర్టులపై వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరూ స్వాగతించరని అన్నారు. న్యాయమూర్తులను బెదిరించే విధంగా సభాపతి వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు.
మీ తప్పులు సరిదిద్దుకునేందుకు కోర్టులు మీకు అవకాశమిస్తున్నందుకు సంతోషించండి. న్యాయస్థానాలకు అన్ని అధికారాలకు ఉంటే మీరు చేస్తున్న పనులకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఆశ్చర్యం లేదు. ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఎవరూ కోర్టులకు వెళ్లరు. ప్రజలు, సమాజం పక్షాన కోర్టులు నిలబడుతున్నాయి. ప్రజలకు మేలు చేసే ఏ కార్యక్రమాన్ని కోర్టులు అడ్డుకోలేదు. అధికారపక్ష నేతలు సంస్కారవంతంగా మాట్లాడాలి. ఇలాంటి ప్రభుత్వం నుంచి కోర్టులు తమను రక్షిస్తున్నాయన్న అభిప్రాయంతో తెలుగువారు ఉన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి కోర్టులను అవహేళన చేయటం తగదు. మీ పరిధిలో మీరు ఉండకపోతే... మీ గురించి మేం మాట్లాడాల్సి వస్తుంది. - సబ్బం హరి