కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో అన్ని రంగాలు అప్రమత్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్లోని పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛంద లాక్డౌన్ను పాటిస్తుండటంతో.. ఆర్టీసీ సైతం సేవలను తగ్గించింది. దీంతో ఆర్టీసీకి ఆదాయం గణనీయందా తగ్గుతోంది. నర్సీపట్నం డిపో పరిధిలో సుమారు 90 బస్సులు.. విశాఖపట్నం, చింతపల్లి , హైదరాబాద్ విజయవాడ , భద్రాచలం , అనకాపల్లి, తుని, చోడవరం తదితర రూట్లలో తిరుగుతున్నాయి. తద్వారా డిపోకు రోజుకు రూ.11 నుంచి 12 లక్షల మేర ఆదాయం వచ్చేది. కొద్దిరోజులుగా నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో కరోనా వైరస్ రెండోదశ తీవ్ర రూపం దాల్చడంతో ఆర్టీసీ అప్రమత్తమైంది. వైరస్ ఉగ్రరూపం దాల్చకుండా.. ప్రయాణికుల సంఖ్య 50 శాతానికి పరిమితం చేసింది. ఈ కారణంగా డిపో ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. సగటున రోజుకి 7, 8 లక్షలకు మించి ఆదాయం రావడం లేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. రెండో విడత వైరస్ వ్యాప్తి కారణంగా మార్చి, ఏప్రిల్ నెలలో రూ.కోటిన్నర వరకు నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. దీనికి తోడు డిపో పరిధిలో ఇప్పటివరకు ఏడుగురు సిబ్బందికి వైరస్ సోకిందని డిపో మేనేజర్ సూర్య పవన్ కుమార్ తెలిపారు. ప్రయాణికులు మాస్కులు ధరించి.. తోటి ప్రయాణికులకు సహకరించాలని సూచించారు.
ఇదీ చదవండి: