విశాఖ శివార్లలో ఒకప్పుడు మధురవాడ ప్రాంతం ఉండేది. అక్కడ హౌసింగ్ బోర్డు కాలనీ ఏర్పడిన అనంతరం పెద్ద ఎత్తున ప్రైవేటు లే అవుట్లు వెలిశాయి. ఈ క్రమంలో ఇక్కడ పలువురు ప్రభుత్వద్యోగులు, చిరుద్యోగులు, ఇంటి స్థలాలను కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే శ్రీ కృష్ణ హౌసింగ్ సొసైటీ ఏర్పడింది. కొరడా కుటుంబం నుంచి 18.36 ఎకరాలను కొనుగోలు చేసి 256 ప్లాట్లుగా విభజించుకుని లబ్ధిదారులకు కేటాయించింది. ఇది 1981 నాడు ఆరంభమైంది. పదేళ్ల తర్వాత మేల్కొన్న రెవెన్యూ యంత్రాంగం ఈ సొసైటీకి కోరాడ కుటుంబం అమ్మిన స్థలంలో.. 9.18 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందంటూ అభ్యంతరం పెట్టింది.
రెండేళ్ల క్రితం విశాఖ జిల్లాలో భూముల అక్రమాలపై ఏర్పాటైన సిట్ వ్యవహారంతో ఈ సొసైటీ భూములను ఏ సంబంధం లేకపోయియినా 22 ఏ జాబితాలో పెట్టేశారు. ఫలితంగా ఈ సొసైటీలో ఇంటి స్థలం కొనుగోలు చేసినవారి పరిస్థితి దయనీయమైంది. రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి.
శ్రీ కృష్ణ సొసైటీలో రిటైర్డ్ ఏఎస్ఐ చిన్నారావు తనయుడు ఇంటి స్థలం కొనుగోలు చేశారు. ఆయన ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తుండేవారు. ప్రమాదవశాత్తు ప్రమాదంలో చనిపోయారు. తనయుడిని కోల్పోయిన దు:ఖంతోపాటు చిన్నారావుకు ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి. ఇంటి స్థలాన్ని అమ్మేందుకు యత్నించారు. ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేయించేందుకు వీలు లేదంటూ అధికారులు చెప్పారు.
సొసైటీలో మిగిలిన వారు సహకరించకున్నా...ఈయన మాత్రం ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని, ఏ అధికారినీ విడిచి పెట్టలేదు. తమ సొసైటీలో ప్రభుత్వ భూమి ఉంటే తీసుకోవాలంటూ అధికారులకు మొరపెట్టుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా ఫలితం లేదు. అప్పటి ముఖ్యమంత్రికి, ప్రధాన కార్యదర్శికి, రెవెన్యూ కార్యదర్శి, జిల్లా కలెక్టర్, జేసీ ఇలా అందరిని కలిసినా పని మాత్రం కాలేదు. కొత్త ప్రభుత్వమైనా తమ మొర ఆలకించాలన్నది ఆయన విజ్ఞప్తి.