మున్సిపల్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖ ప్రజలను కోరారు. తమ పార్టీ అభ్యర్థుల తరఫున తూర్పు నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటు వేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే భాజపా తరపు మేయర్ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. అనంతరం అప్పుఘర్‌లో ఉన్న సూయిజ్ ప్లాంట్ నిర్వహణ వాటి స్థితిగతులను పరిశీలించారు.
విశాఖ సాగర తీరం అందాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలందరిపై ఉందని నరసింహారావు అన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా నరసింహారావు ఆధ్వర్యంలో భాజపా కార్యకర్తలు బీచ్ క్లీనింగ్ నిర్వహించారు. అంబికా సీ గ్రీన్ ప్రాంతంలో బీచ్‌లో పడి ఉన్న ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, చెత్తా, చెదారాన్ని శుభ్రపరిచారు. పర్యావరణాన్ని మనం పరిరక్షిస్తే... పర్యావరణం మనల్ని రక్షిస్తుందని అన్నారు. బీచ్ పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రభుత్వ పనితీరు సంతృప్తిగా లేదని అన్నారు. బీచ్‌ల సుందరీకరణకు కేంద్రం కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించి అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: నగర పోరు: ప్రచారంలో ప్రధాన పార్టీలు పోటాపోటీ