మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శ జేవీ సత్యనారాయణ మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. హథ్రాస్ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మహా విశాఖ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ గురజాడ విగ్రహం వరకు పార్టీ శ్రేణులు ర్యాలీ చేపట్టారు.
మానవమృగాలను వెంటనే శిక్షించాలి..
యూపీలోని హథ్రాస్‌లో ఎస్సీ యువతిపై అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడి హత్యాచారం చేసిన మానవమృగాలను వెంటనే శిక్షించాలని మూర్తి డిమాండ్ చేశారు.
ఆవును రక్షిస్తూ.. స్త్రీని భక్షిస్తూ...
మహిళలపై, ఎస్సీలపై జరుగుతున్న దాడులను నియంత్రించడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని... యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ప్రధాని, రాష్ట్రపతిని సత్యనారాయణ మూర్తి కోరారు. ఆవును రక్షిస్తూ ఆడవారిని భక్షిస్తున్న ఉత్తర ప్రదేశ్ సర్కార్‌ను వెంటనే రద్దు చేయాలన్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
పెద్ద ఎత్తున ఆందోళన..
భాజపా ప్రతిపక్షంలో ఉండగా దిల్లీలో నిర్బయ ఘటన జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారని, ఇప్పుడు భాజపా పాలిస్తున్న రాష్ట్రాల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉందని ఆయన మండిపడ్డారు. నిరసన ప్రదర్శనలో సీపీఐ నగర కార్యదర్శి ఎం. పైడిరాజు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమల, డీహెచ్సీఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్రావు, సీపీఐ నగర సహాయ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ, పైలా ఈశ్వర్ రావు చంద్రశేఖర రావు, వామనమూర్తి తదితరులు పాల్గొన్నారు.