Modi Tour In Visakha: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 11 వ తేదీన మధురై నుంచి నేరుగా విశాఖపట్నంకు సాయంత్రం 6:30 గంటలకు చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తూర్పు నౌకాదళం చేరుకుని చోళ సూట్‌లో బస చేస్తారు. మరుసటి రోజైన శనివారం ఉదయం 10.30 గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలోని బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 10 వేల 472 కోట్ల రూపాయల విలువైన 5 ప్రాజెక్టులకు శంకు స్థాపనలు, రెండు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేయనున్నారు.
విశాఖ మత్స్యకారులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, విస్తరణ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రాయపూర్-విశాఖల మధ్య 3 వేల 778 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆరు లైన్ల గ్రీన్ ఫీల్డ్ క్యారిడార్, కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకూ 566 కోట్లతో నిర్మించనున్న డెడికేటెడ్ పోర్టు రోడ్డు నిర్మాణానికి కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. అనంతరం 460 కోట్లతో తలపెట్టిన విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ నిర్మాణాలకు భూమి పూజ చేస్తారు. శ్రీకాకుళం నుంచి ఒడిశా ఆంగుల్ పట్టణం వరకూ గ్యాస్ అథారిటీ 2 వేల 658 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సహజవాయు సరఫరా పైపు లైన్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు.
211 కోట్ల రూపాయలతో పాతపట్నం- నరసన్నపేటలను కలుపుతూ నిర్మించిన నూతన జాతీయ రహదారిని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అలాగే 2 వేల 917 కోట్లతో ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్ షోర్లో అభివృద్ధి చేసిన యూ-ఫీల్డ్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. వర్చువల్ విధానంలోనే ప్రధాని వీటన్నింటికి పచ్చజెండా చూపుతారని అధికారులు వెల్లడించారు. ప్రధాని మోదీతో పాటు ఈ కార్యక్రమాల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, ఉన్నతాధికారులు పాల్గొంటారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాలి: అయితే ప్రధాని ఈ నెల 11న విశాఖ వస్తున్నందున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన చేయాలని.. స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈరోజు కూర్మన్నపాలెం నుంచి జీవీఎంసీ వరకు బైక్ ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. ర్యాలీని విజయవంతం చేయాలని అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు స్టీల్‌ప్లాంట్ పరిరక్షణతో పాటు, రైల్వేజోన్, విభజన హామీలను వెంటనే అమలు చేస్తామని విశాఖ సభలో ప్రధాని హామీ ఇవ్వాలని.. రాజకీయపార్టీల ఐకాస డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుని ప్రధానితో ప్రకటన చేయించాలని నేతలు సూచించారు.
ఇవీ చదవండి: