Prime Minister Modi meeting in Visakhapatnam: ప్రధాని మోదీ సభకు విశాఖలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని విశాఖ పర్యటనలో భాగంగా... ఏయూ వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రధానితోపాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ శుక్రవారం రాత్రే నగరానికి చేరుకున్నారు. బహిరంగ సభ వద్ద అతిథుల కోసం 3 వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై ప్రధాని, సీఎం, గవర్నర్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాత్రమే ఆశీనులవుతారు. రెండో వేదికపై రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మేల్యే, ఎమ్మేల్సీలు,జీవియల్ సోము వీర్రాజు,పీవియన్ మాధవ్ సహా.. 15 మంది భాజపా నేతలకు అవకాశం కల్పించారు.
ఆ రెండు వేదికలకు సమీపంలో 300 మంది ఆశీనులయ్యే విధంగా మరో వేదిక ఏర్పాటు చేశారు. దీన్ని రాజకీయ ప్రముఖులు, నామినేటెడ్ పదవులు పొందినవారు, వివిధ సంస్థల ఛైర్మన్లకు కేటాయించారు. సీఎస్, డీజీపీ, ఐఎయస్ అధికారులు, ప్రముఖులకు 66 పాసులు జారీ చేశారు. వీరికి వేదిక సమీపంలో సీట్లు కేటాయించారు. శుక్రవారం రాత్రే విశాఖ చేరుకున్న ప్రధాని... తూర్పు నావికాదళం చోళ అతిథిగృహంలో బస చేశారు. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రధానిని... గవర్నర్, సీఎం కలవనున్నారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ముగ్గురూ హెలికాప్టర్‌లో సభా వేదిక వద్దకు చేరుకుంటారు. సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3 లక్షల మందిని తరలిస్తున్నారు. 4 వేల బస్సులు, పెద్ద ఎత్తున వాహనాలు ఏర్పాట్లు చేశారు. 8 వేల 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
విశాఖ సభా వేదిక నుంచి ప్రధాని మోదీ సుమారు.. 15 వేల 233 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. పాతపట్నం నుంచి నరసన్నపేట మధ్య రెండు లైన్ల రహదారిని..... ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. తూర్పు తీరంలో 2వేల917 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఓఎన్జీసీ యూ ఫీల్డ్ , 385 కోట్ల రూపాయలతో ఐఒసీఎల్. చేపడుతున్న గ్రాస్ రూట్ డిపో నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. విజయవాడ-గుడివాడ-భీమవరం-నిడదవోలు రైల్వే లైన్, గుడివాడ-మచిలీపట్నం, భీమవరం-నర్సాపురం రోడ్ల అభివృద్ధి పనుల్ని ప్రారంభిస్తారు. విశాఖ సభలో మోదీ 40 నిమిషాలు మాట్లాడనుండగా.. సీఎం జగన్‌కు 7 నిమిషాల సమయం కేటాయించారు. సభ ముగిసిన అనంతరం ప్రధాని హైదరాబాద్ వెళ్తారు.
ఇవీ చదవండి: