కాబోయే తల్లులకు మన్యంలో కష్టాలు, కన్నీళ్లు నిత్యకృత్యంగా మారాయి. మన్యంలో డోలీ మోతలకు స్వస్తి పలకాలని గర్భిణీలకు ప్రసవానికి వారం రోజులు ముందే సమీప ఆసుపత్రులకు తరలించాలని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేస్తున్నా ఇవి క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావడం లేదు.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు కిలోమీటర్లు నిటారుగా ఉన్న కొండ ఎక్కి విశాఖ మన్యం చింతపల్లి మండలం బలపం పంచాయతీ తోక పాడు నుంచి ఓ గర్భిణీని అతికష్టం మీద డోలిలో ఆసుపత్రికి తరలించారు. తోకపాడు గ్రామానికి చెందిన కూసంగి చంద్రమ్మ(22)కి నెలలు నిండటంతో మంగళవారం రాత్రి నుంచి ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. తోకపాడు గ్రామం నుంచి రోడ్డు పాయింట్‌కు వెళ్లాలంటే దట్టమైన అటవీ ప్రాంతంలో దాదాపు నాలుగు కిలోమీటర్లు నిలువుగా ఉన్న కొండ ఎక్కాలి. చంద్రమ్మది మొదటి కాన్పు. ఆశ కార్యకర్త గ్రామస్తులకు అప్రమత్తం చేయడంతో వారు బుధవారం ఉదయం నాలుగు కిలోమీటర్ల దూరం ఆమెను డోలీలో రహదారి సమీపానికి తీసుకొచ్చారు. అక్కడినుంచి లోతుగెడ్డ పీహెచ్‌సీకి తరలించడానికి అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. వారు రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పడంతో ఆటోలో లోతుగెడ్డ పీహెచ్‌సీకీ తీసుకొచ్చారు.
తమ గ్రామానికి రహదారి సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామని, అష్టకష్టాలతో గర్బిణీని తరలించామని తోకపాడు గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి రోడ్డు వేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: మాడుగుల ఎస్ఐ సాహసం.. నదిలో దూకి మృతదేహం వెలికితీత