విశాఖ జిల్లా చింతపల్లి సమీపంలోని అంతర్ల గ్రామానికి చెందిన కవడం శిరీష.. ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భవతి. ఈమెకు ఇది రెండో కాన్పు. తొలి విడత కాన్పు తరువాత నిర్వహించిన పరీక్షల్లో చికెన్ సెల్ ఎనీమియా వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్య సిబ్బంది గుర్తించారు. ఇప్పడు రెండో కాన్పు కచ్చితంగా విశాఖ కేజీహెచ్‌లోనే జరగాల్సి ఉందని ఆర్‌వీ నగర్ పీహెచ్‌సీ వైద్యాధికారిణి గాయత్రి గుర్తించారు.
ప్రసవ తేదీ ఈ నెల 16గా నిర్ణయించిన వైద్యులు... గర్భిణిని మూడు రోజుల ముందే కేజీహెచ్‌కు పంపించాలని నిర్ణయించారు. వైద్యసిబ్బంది ఈమెను తీసుకెళ్లేందుకు ఇంటికి వెళ్లగా ఆమె విశాఖ వెళ్లేందుకు నిరాకరించింది. ఇంటి వద్దే ప్రసవం అయితే తల్లీబిడ్డకూ ప్రమాదమని కచ్చితంగా కేజీహెచ్‌లో ప్రసవం జరగాలని నచ్చజెప్పినా ఆ గర్బిణి ససేమిరా అని మొండికేసింది.
ఇదే విషయం పాడేరు ఐటీడీఏ పీవోకు సమాచారం అందించగా అవసరమైతే పోలీసుల సాయంతోనైనా ఆమెను విశాఖ తరలించాలని పీవో.. వైద్య సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ఎట్టకేలకు కుటుంబ సభ్యుల సహకారంతో గర్భిణిని బలవంతంగా అంబులెన్స్‌లో విశాఖ కేజీహెచ్‌కు తరలించామని సిబ్బంది తెలిపారు. కరోనా కేసులు అధికంగా ఉన్న కారణంగానే.. కేజీహెచ్‌కు వెళ్లేందుకు గర్బిణి నిరాకరించినట్లు చెప్పారు.