పురపాలిక ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని విశాఖ జాయింట్ కలెక్టర్ గోవిందరావు సూచించారు. ఆర్వోలు, ఏఆర్వోలతో బుధవారం నర్సీపట్నం, ఎలమంచిలి పురపాలిక కార్యాలయాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మధ్యాహ్నం మూడు గంటలతో ముగుస్తుందని, ఆ వెంటనే పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించాలని సూచించారు.
నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలతో ముగుస్తుందని తెలిపారు. ఎన్నికల నిబంధనలను అధికారులు కచ్చితంగా తెలుసుకోవాలని పేర్కొన్నారు. పోలింగ్ పూర్తయి లెక్కింపు వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్డీవో సీతారామారావు, ప్రత్యేక అధికారి రవిజోసఫ్ అధికారులకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు నర్సీపట్నం డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ఓట్లలెక్కింపు కేంద్రాన్ని జేసీ పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ కనకారావు, పట్టణ ప్రణాళికాధికారి గౌడు తదితరులతో కలిసి సబ్‌కలెక్టర్ మౌర్య గచ్ఛపువీధి, పీనారిపాలెం, అయిదు రోడ్లు కూడలిలోని పాఠశాలల్లో పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. వీటిలో సౌకర్యాలపై తెలుసుకున్నారు. కేంద్రాల్లో ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ర్యాంపులు విధిగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: సీడ్‌యాక్సెస్ రోడ్డును వదిలేసి కరకట్ట రోడ్డుకు తొలి ప్రాధాన్యం