మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు పర్యటించి... గిరిజనులలో మనోధైర్యాన్ని నింపేలా చర్యలు తీసుకుంటున్నారు. యువకుల్లో క్రీడా స్ఫూర్తిని కలిగించేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. "మీ జీవితాలకు పూర్తి రక్షణతో పాటు మీ భవిష్యత్‌కు భరోసా కల్పించే బాధ్యత తమ పోలీసుశాఖ తీసుకుంటుందని" విశాఖ ఓఎస్‌డీ బి.కృష్ణారావు అన్నారు. ఇందులో భాగంగానే మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బలపం పంచాయతీ కోరుకొండ కూడలిలో... మంగళవారం ఉచిత వైద్య శిబిరంతో పాటు మెగా వాలీబాల్ టోర్నమెంట్‌ను నిర్వహించింది. చింతపల్లి ఏఎస్పీ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మారుమూల గ్రామాల నుంచి గిరిజనులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఓ వైపు వైద్యశిబిరం... మరో వైపు వాలీబాల్ పోటీలను నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి మొత్తం 40 జట్లు ఇందులో పాల్గొన్నాయి. ఈ పోటీల్లో ప్రథమ స్థానం పొందిన రాళ్లగెడ్డ కొత్తూరుకు రూ.20 వేలు, ద్వితీయ స్థానం సాధించిన చినలోవసింగికు రూ.10వేలు, తృతీయస్థానం పొందిన మూలకొత్తూరు జట్టుకు రూ.5 వేలు నగదు బహుమతిని అందజేశారు. వైద్యశిబిరంలో చింతపల్లి సామాజిక ఆసుపత్రి చంటిపిల్లల వైద్యనిపుణుడు దశరథ్, కోరుకొండ వైద్యాధికారి సంతోష్‌లు అవసరమైన వైద్యసేవలను అందించారు. అనంతరం గిరిజనులతో కలసి పోలీసు అధికారులు భోజనాలు చేశారు.
ఇదీ చూడండి: