విశాఖ జిల్లాలో..
నర్సీపట్నం మండలం ధర్మసాగర్ సమీపంలో నాటుసారా స్థావరాలపై నర్సీపట్నం గ్రామీణ పోలీసులు దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీ సామగ్రితో పాటు పలు ప్లాస్టిక్ పాత్రలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. సారా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 1500 లీటర్ల బెల్లం ఊటను ఎస్సై రవికుమార్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు.
ప్రకాశం జిల్లాలో...
ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం నరాజముల తండా అటవీ ప్రాంతంలో ఉన్న నాటు సారా శిబిరాలపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా తయారు చేయడానికి సిద్ధంగా ఉంచిన 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి.. ఒకరిని అరెస్ట్ చేశారు. యర్రగొండపాలెం, పుల్లల చెరువు, త్రిపురంతాకం మండలాల్లో ఎక్కడైనా నాటు సారా తయారీ, అమ్మకాలు జరిపితే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
అనంతపురం జిల్లాలో...
అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్ట్ వద్ద కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి మద్యాన్ని తీసుకువచ్చి.. ఓబులదేవరచెరువు మండలంలో విక్రయిస్తున్నారనే ముందస్తు సమాచారంతోనే.. వాహనాల తనిఖీ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేసి.. 34 బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: 'పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత'