Vande Bharat Express launched : తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ రైలు ప్రారంభమైంది. ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తొలి సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కింది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఇవాళ ఉదయం దిల్లీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, బీజేపీ నేతలు, రైల్వే శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘పండగ వాతావరణంలో తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ గొప్ప కానుక. తెలుగు ప్రజలకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రైలు ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణానికి దోహదపడుతుంది. హైదరాబాద్- వరంగల్ - విజయవాడ - విశాఖ నగరాలను అనుసంధానిస్తూ ప్రయాణం సాగుతుంది. సికింద్రాబాద్ - విశాఖ మధ్య ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది." అని అన్నారు.
"వందే భారత్ పూర్తిగా దేశీయంగా తయారైంది. పూర్తి దేశీయంగా తయారైన వందేభారత్‌తో బహుళ ప్రయోజనాలున్నాయి. అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేరుస్తుంది. భద్రతతో పాటు రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. 2023లో ప్రారంభిస్తున్న తొలి వందేభారత్ రైలు ఇది. మారుతున్న దేశ భవిష్యత్తుకు ఇదొక ఉదాహరణ’’ - నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
Modi launched Vande Bharat Express : సికింద్రాబాద్‌లోని 10వ నంబర్ ప్లాట్ ఫాం నుంచి ప్రారంభమైన వందేభారత్ రైలులో.. 16 బోగీలు ఉన్నాయి. అందులో 14 చైర్ కార్ బోగీలు, మరో రెండు ఎగ్జిక్యూటీవ్ చైర్‌కార్ బోగీలుంటాయన్నారు. మొత్తంగా రైలులో 1128 మంది ప్రయాణించవచ్చు. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు ఈ రైలు సికింద్రాబాద్-విశాఖల మధ్య పరుగులు పెట్టనుంది. మెట్రో రైల్ తరహాలో స్లైండింగ్ తలుపులు, ప్రయాణికుల భద్రత, సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యమిచ్చారు.
Vande Bharat Express Started From Secunderabad : సీసీటీవీ కెమెరాలు, రీడింగ్ లైట్లు, అత్యవసర పరిస్థితుల్లో రైల్ సిబ్బందితో మాట్లాడేందుకు ప్రత్యేకంగా అలారం బటన్ ఏర్పాటు చేశారు. విశాఖ నుంచి ప్రతిరోజూ ఉదయం 5.45కి వందే భారత్ రైలు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై.. రాత్రి పదకొండున్నరకి విశాఖపట్నానికి చేరుకుంటుంది. ఈ వందేభారత్ రైలు గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని దక్షిణ మధ్య రైల్వే ..సికింద్రాబాద్-విజయవాడ మధ్య 350కిలోమీటర్ల దూరాన్ని 4గంటల్లో చేరుకుంటుందని.. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ఎనిమిదిన్నర గంటల్లో చేరుకుంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
వందేభారత్ టికెట్ ధరలను రైల్వేశాఖ అధికారికంగా ప్రకటించింది. చైర్‌కార్‌లో సికింద్రాబాద్ నుంచి వరంగల్‌కి 520.. ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్‌కి వెయ్యి 5 రూపాయలు వసూలు చేయనున్నారు. చైర్‌కార్‌లో సికింద్రాబాద్ నుంచి ఖమ్మం వరకు 750, సికింద్రాబాద్ నుంచి విజయవాడకు 905.. సికింద్రాబాద్ నుంచి రాజమండ్రికి 1365, సికింద్రాబాద్ నుంచి విశాపట్నానికి వెయ్యి 665 వసూలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
అదే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కి వెయ్యి 720 టికెట్ ధరగా నిర్ణయించినట్లు చెప్పారు. ఒకవేళ ఎవరైనా ఆహారం వద్దనుకుంటే ఆ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం నుంచి అందుబాటులోకి రానున్న వందే భారత్ కోసం సీట్ల రిజర్వేషన్‌ను అధికారులు శనివారం ప్రారంభించారు. సాయంత్రం వరకే మంగళ, బుధవారం వరకే వెయిటింగ్ లిస్ట్ వచ్చిందని చెప్పారు.
ఇవీ చదవండి: