విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని ఏకైక గిరిజన పంచాయతీ కోనాం శివారు జాజులపాలెం. ఆ గ్రామానికి కాజ్ వే ద్వారా ఎంతోమంది రోజూ ప్రయాణం సాగిస్తుంటారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ మార్గంలోని కాలువపై రోడ్డు కొట్టుకుపోయింది. సిమెంట్ పైపులు మాత్రమే మిగిలాయి. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా.. నేటికీ అధికారులు, పాలకులు కనీసం పట్టించుకోలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ మాత్రం వర్షం పడినా.. కాలువలు పొంగి బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోతున్నాయని వాపోతున్నారు. మరోవైపు ఉన్న మట్టి రోడ్డు కాస్తా.. వర్షానికి కోతకు గురికావడంతో అధ్వానంగా మారింది. నడవడానికి సైతం ప్రమాదకరంగా తయారైంది. అధికారులు స్పందించి గుడివాడ నుంచి జాజులపాలెం వరకు రహదారి నిర్మించాలని.. కాలువపై కాజ్ వే మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
వర్షం వస్తే రాకపోకలకు కష్టమే..!
గుడివాడ నుంచి జాజులపాలెం వెళ్లే రోడ్డులో కాలువపై కాజే వే కొట్టుకుపోయింది. రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం. ఏ మాత్రం వర్షం పడినా.. మట్టిరోడ్డు బురదమయంగా మారుతుంది. అవస్థలు తప్పడం లేదు. ఇక్కడ రోడ్డు, కాలువపై వంతెన నిర్మిస్తే మా కష్టాలు తీరుతాయి - అప్పన్న, గిరిజన రైతు
రెండు నెలలుగా కష్టాలే..!
ఇక్కడ కాలువపై కాజ్ వే కొట్టుకుపోయి రెండు నెలలు గడుస్తోంది. ఎవరూ పట్టించుకోలేదు. రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. గిరిజన ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారింది - రాజమ్మ, గిరిజన మహిళ
ఇదీ చదవండి: పూర్తిస్థాయి నీటి నిల్వలతో రైవాడ జలాశయం