ఇంతకాలం చెరకు పంటను పట్టిపీడిస్తున్న పసుపు ఆకు తెగులును తట్టుకునే కొత్త వంగడాన్ని విశాఖ జిల్లా అనకాపల్లి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు రూపొందించారు. గత ఆరేళ్లుగా శాస్త్రవేత్తలు నిరంతరం చేసిన పరిశోధనల ఫలితంగా 2015 ఏ 311 వంగడం పసుపు తెగులును తట్టుకుంటున్నట్లు గుర్తించారు. మరో రెండేళ్లు రైతుల కమతాలలో పరిశీలన చేసి అప్పుడు అధికారికంగా విడుదల చేయనున్నారు. ‘కోజే 270, కో 89029 రకాలను సంకరపరచి దీన్ని రూపొందించాం. పది నెలల్లో పక్వానికి వస్తుంది. హెక్టారుకు 132 టన్నుల దిగుబడి, 18.91 శాతం రసనాణ్యత ఉంటుంది’ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పుష్కరకాలం కిందట జిల్లాలో కో975, కో87044, 87ఏ298 రకాలపై శాస్త్రవేత్తలు తొలిసారిగా పసుపు ఆకు తెగులును గమనించారు. తర్వాత నెల్లూరు, సామర్లకోటతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సోకింది. మొక్క ప్రారంభంలోనే వైరస్ ఉన్నా ఏడు నెలల తర్వాత లక్షణాలు తెలుస్తున్నాయి. అప్పటి వరకు తోట ఆరోగ్యంగానే ఉంటుంది. ముందుగా మొవ్వు ఆకులలో మూడు, నాలుగు ఆకుల మధ్య ఈనెలు పసుపు రంగులో మారతాయి. ఆకు మొత్తం వ్యాపిస్తుంది. తెగులు ఎక్కువగా ఉంటే గడలు సన్నబడి, ఎదుగుదల ఆగిపోతుంది.
చెరకు సాగుకు దూరం
గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్న రైతుకు చెరకు తోటలకు కొత్త తెగులు సోకిందని తెలిసి మరింత కుంగిపోవడంతోపాటు సాగుకు దూరమవుతున్నారు. కొన్నేళ్లుగా చెరకు తోటలు ఎదుగుదల లేక గిడసబారి పోతున్నాయి. ప్రస్తుతం సాగులో ఉన్న అన్ని రకాలు తెగులుకు గురవుతున్నాయి. ఉత్తరాంధ్రలో 87ఏ298, 81ఏ99, 2001ఏ63, 2000ఏ225, గోదావరి జిల్లాల్లో కో86032, కో7805, 2000వి46 రకాలకు తెగులు ఉన్న లక్షణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. చెరకులో 16 రకాల వైరస్ తెగుళ్లు ఉన్నట్లు ఇంతవరకు శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలో వైరస్ తెగుళ్లు తక్కువ స్థాయిలో చెరకు తోటల్లో ఉండేవని, రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, నాణ్యమైన విత్తనం వాడకపోవడం, వాతావరణంలో మార్పులు కారణంగా వైరస్ తెగుళ్లు ఎక్కువగా సోకుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో దాదాపు అన్ని రకాల్లోనూ ముఖ్యంగా కార్శి తోటల్లో తెగుళ్లు ఉన్నట్లు వీరు గుర్తించారు.
నివారణ చర్యలు.. యాజమాన్య పద్ధతులు
తెగులు సోకిన తోటల్లో దిగుబడి, పంచదార 37 శాతం తగ్గిపోతుంది. గెడ పరిమాణంలో 20 నుంచి 25 శాతం తగ్గుతుంది. గెడలలో కణుపుల మధ్య దూరం బాగా తగ్గిపోతుంది. సాధారణంగా ఒక కేజీ చెరకు గెడ నుంచి 429 మి.లీ. రసం వస్తుంది. తెగులు సోకితే 275 మి.లీ. పడిపోతుంది. దీనికి కారణం ఆకులు పసుపు రంగులోకి మారి కిరణజన్య సంయోగక్రియ జరిపే శక్తి తగ్గిపోవడమే. దీని నివారణకు మందులు లేవు. తెగులు సోకిన తోట నుంచి విత్తనం సేకరించకూడదు.
- మరో రెండేళ్లు..
2015 ఏ 311 రకం పసుపు ఆకుతెగులును తట్టుకుంటున్నట్లు పరిశోధనలలో గుర్తించాం. రైతుల భూములలో మరో రెండేళ్లు నాటి అక్కడ పరిశీలిస్తాం. అక్కడ తట్టుకున్నట్లు నిర్ధరించిన తర్వాత అధికారకంగా విడుదల చేస్తాం. అయిదు దశాబ్దాల కిందట చెరకు పంటకు ఎర్రకుళ్లు తెగులు సోకింది. అప్పుడు పరిస్థితి ఇంత కంటే దారుణంగా ఉండేది. కో997, కో419 చెరకు రకాలకు నాడు ఎర్రకుళ్లు తెగులు సోకింది. ఈ తెగులును తట్టుకునే కోఏ7602 రకాన్ని అనకాపల్లి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలే రూపొందించి చెరకు రైతుకు అండగా నిలిచారు. మళ్లీ ఇప్పుడు పసుపు ఆకుతెగులును తట్టుకునే రకాన్ని రూపొందించాం. రైతులు ఏటా చెరకు తోటలనే వేస్తున్నారు. రెండేళ్లకోసారి పంట మార్పిడి చేసుకోవాలి. తెగులు సోకని ఆరోగ్యవంతమైన తోటల నుంచి విత్తనం సేకరించాలి. ఒంటి కన్ను నారు మొక్కలు నాటు కోవడం మంచిది.
- డాక్టరు ఎం.భరతలక్ష్మి, ఏడీఆర్, అనకాపల్లి పరిశోధన కేంద్రం
ఇదీ చదవండి: