విశాఖ నగర పరిధిలో నమోదు చేసిన ఎన్డీపీఎస్ (నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టెన్సెస్) కేసుల వివరాలను ఎస్ఈబీ అధికారులు వెల్లడించారు. పెందుర్తి, దువ్వాడ సహా మూడవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఏడీసీపీ అజిత వేజండ్ల తెలిపారు. మొత్తం 8మందిని అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు.
పెందుర్తిలోని ఓ అపార్టుమెంట్లో ఇద్దరు యువతులను అరెస్టు చేసి, వారి నుంచి కిలో ద్రవ రూప గంజాయి, హాషిష్ ఆయిల్ స్వాధీనం పరుచుకున్నామని వివరించారు. పెదబయలులో గ్యాస్ సిలిండర్లో తరలిస్తున్న 48కిలోల గంజాయి పట్టుబడిందని, నలుగురిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. మరో కేసులో హైదరాబాద్కు చెందిన ఇద్దరిని అరెస్టు చేసి, నిందితుల నుంచి 7కేజీల గంజాయి సీజ్ చేశామని చెప్పారు. వీరందరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు అజిత వేజండ్ల తెలిపారు.
ఎస్ఈబీ తనిఖీల్లో మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశామని, వారి నుంచి అక్రమ మద్యంతో పాటు, రూ.లక్షా 65వేలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: 'పరిష్కారాలు అందిస్తే... రాష్ట్రానికి ఉపయోగకరం'