Nadendla Manohar Arrested By Vizag Police: విశాఖ టైకూన్ కూడలి నుంచి వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడంపై, జనసేన ఆందోళనకు దిగారు. వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడంతో ప్రయాణికులు సుమారు 2 కిలోమీటర్లు అదనపు దూరం ప్రయాణం చేయాల్సి వస్తోందని జనసేన ఆరోపించారు. స్థానిక ఎంపీ నిర్మిస్తున్న బిల్డింగ్ అమ్మకాలు పెంచుకోవడం కోసం ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని నేతలు మండిపడ్డారు. నాదెండ్ల మనోహర్ సహా జనసేన నేతల్ని, కార్యకర్తల్ని, వీర మహిళల్ని పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికం - విడుదల చేయకపోతే విశాఖ వచ్చి పోరాడుతా: పవన్‌కల్యాణ్
టైకూన్ కూడలి రోడ్డు మూసివేతపై జనసేన నాయకుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వీఐపీ రోడ్డులోనే పెద్దఎత్తున పోలీసులు మోహరించి, అటువైపు వచ్చిన నాయకులను అదుపులోకి తీసుకున్నారు. టైకూన్ కూడలి ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్న జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను నోవాటెల్ హోటల్ లోనే పోలీసులు ఆపేశారు. హోటల్ గేటు వద్దకు వచ్చిన మనోహర్ బయటికి రాకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై నాదెండ్ల మనోహర్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలు మానుకోవాలని వైసీపీ నేతలకు సూచించారు. వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడం వల్ల ప్రయాణికులు సుమారు 2 కి.మీ మేర అదనపు దూరం వెళ్లాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఎంపీ నిర్మిస్తున్న బిల్డింగ్ సేల్స్ పెంచుకోవడం కోసం ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నారని ఆరోపించారు. వాస్తు దోషం తొలగించుకోవడానికి రోడ్లు మూసివేయడం అన్యాయం అని పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులు ఆలోచన చేయాలని మనోహర్ పేర్కొన్నారు. డివైడర్ తొలిగించే వరకు జనసేన పోరాడుతుందని, ఈ ప్రభుత్వానికి ఇంకా మూడు నెలలు మాత్రమే గడువు మిగిలి ఉందిని నాదెండ్ల వ్యాఖ్యానించారు.
సమస్యలపై ప్రశ్నిస్తే ఎమ్మెల్యే టార్గెట్ చేస్తున్నారు - అందుకే వైసీపీకి రాజీనామా!
స్పందించిన పవన్: నాదెండ్ల మనోహర్ సహా జనసేన పార్టీ నాయకుల అరెస్టును, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. అరెస్టులు అప్రజాస్వామికమని పవన్ వెల్లడించారు. విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే, అరెస్టు చేస్తారా అని నిలదీశారు. జనసేన శ్రేణులపై పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసినవారిని విడుదల చేయకపోతే, విశాఖకు వచ్చి పోరాడతానని పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామ్యమని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ధ్వజమెత్తారు. విశాఖలోని టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే, అక్రమంగా అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. నాదెండ్ల మనోహర్‌తో పాటుగా పార్టీ నేతలను తక్షణమే విడుదల చేయాలని పోతిన వెంకట మహేష్ డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్, గంజాయి మాఫియాకు అండగా నిలుస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.