విశాఖ ఏజెన్సీ కొయ్యూరు గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల నుంచి ఈ నెల 2వ తేదీన ముగ్గురు విద్యార్థులైన రాహుల్ గాంధీ, విజయ్‌కుమార్, లక్ష్మణరావు ఎవరికీ చెప్పకుండా పిడుగురాయిలోని జాతరకు వెళ్లారు. అక్కడినుంచి రాజమండ్రి చేరుకుని వారి వద్ద ఉన్న డబ్బులతో మహారాష్ట్రలో ఇందాపూర్ చేరుకున్నారు. బంధువులు గతంలో అక్కడ పని చేయడంతో ఇందాపూర్ వెళ్లారు.. తెలిసిన వారి ద్వారా ముగ్గురు ఇందాపూర్ చేపల మార్కెట్‌లో బాల కార్మికులుగా చేరారు. విద్యార్థుల కోసం వెతుకులాటలో డిప్యూటీ వార్డెన్ గోపాలకృష్ణ ఈ నెల 4న పిడుగురాయి వెళ్లి తల్లిదండ్రులను అడగగా.. వారు పాఠశాలకు వచ్చారు కదా అని సమాధానమిచ్చారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై.. స్నేహితుల ద్వారా సమాచారం తెలుసుకుని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మహరాష్ట్రలోని ఇందాపూర్‌లో ఉన్నారనే సమాచారంతో సిబ్బంది అక్కడికి చేరుకుని.. చేపల మార్కెట్‌లో పనిచేసే వారిని చూసి విస్తుపోయారు. నిర్వాహకులను తమ వెంట విద్యార్థులు పంపాలని అడగగా.. ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున రూ.45 వేలు కట్టాలని డిమాండ్ చేశాడు. సిబ్బంది విద్యార్థుల గుర్తింపు కార్డులు చూపించేసరికి.. పాఠశాల సిబ్బందితో విజయవాడ వచ్చే బస్సులో పంపించారు. అక్కడినుంచి కొయ్యూరు పాఠశాలకు విద్యార్థులతో కలసి సిబ్బంది చేరుకున్నారు. పది రోజులుగా వారి ఆచూకీ కోసం గాలిస్తున్న సిబ్బంది కాస్తా ఊపిరి పీల్చుకున్నారు ఎస్సై నాగేంద్ర విద్యార్థుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు..
ఇదీ చూడండి. తెలంగాణ: బాలుడిపై అడవి పంది దాడి.. రక్షించిన స్థానికులు