భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్లో వరద ముంపు ప్రాంతాలను నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పరిశీలించారు. ఈ మేరకు డివిజన్లోని నాతవరం మండలం తాండవ జలాశయం నీటి నిల్వపై అధికారులను ఆరా తీశారు. తాండవ జలాశయంలోకి భారీగా వరద నీరు రావడంతో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది.
- అదనపు నీటి విడుదల..
ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా, గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీటిమట్టం 379 అడుగులకు చేరింది. ఫలితంగా రెండు గేట్లను ఎత్తడం ద్వారా అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు, తుని, విశాఖ జిల్లాలోని పాయకరావుపేట తదితర ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ఈ మేరకు జలాశయం పరిస్థితిని సబ్ కలెక్టర్ మౌర్య సందర్శించి నీటి మట్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు నీటి మట్టం వివరాలను తమకు తెలియజేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.