వ్యవసాయ రంగ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపటంతో... రాష్ట్రాల్లో వ్యవసాయ మార్కెట్ యార్డుల చరిత్ర ముగిసినట్లేనని తెలుస్తోంది. రాష్ట్రంలో చెక్‌పోస్టులను మార్కెటింగ్ శాఖ ఇప్పటికే మూసివేసింది. వ్యవసాయ ఉత్పత్తుల రూపంలో ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. దీంతో మార్కెటింగ్ యార్డుల మనుగడ కోసం ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల వైపు ఆ శాఖ దృష్టి సారిస్తోంది. విశాఖ జిల్లాకు సంబంధించి అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి, చోడవరం, భీమునిపట్నం, చింతపల్లి తదితర ప్రాంతాల్లో 12 వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి.
వ్యవసాయరంగ నూతన చట్టాలు అమలులోకి వస్తే రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా ఎవరికైనా విక్రయించేందుకు వీలు లభిస్తోంది. దీంతో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు వచ్చే ఆదాయం పూర్తిగా పడిపోయే ప్రమాదం ఏర్పడింది. దీన్ని అధిగమించడానికి ప్రతి మండల కేంద్రంలో మార్కెటింగ్ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. గిట్టుబాటు ధర లభించే వరకు వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి మండల కేంద్రాల్లో గోదాములు నిర్మించనున్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 600 చెక్‌పోస్టుల ఎత్తివేతతో సుమారు 2,500 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. వారందరికి మార్కెటింగ్ శాఖ కార్యాలయాలు, గోదాములు, వ్యవసాయ, ఉద్యాన తదితర అనుబంధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిపై నియమించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఇదీచదవండి