విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో కరోనా సోకి ఓ వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని బంధువులు ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టారు. గవరపాలెం దిబ్బవీధికి చెందిన ఓ వ్యక్తికి వారం క్రితం కరోనా పాజిటివ్ అని తెలింది. దీంతో బాధితుడిని చికిత్స కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ సదరు వ్యక్తి గురువారం రాత్రి మృతి చెందాడు. సరైన వైద్య సేవలు అందించకపోవటంతోనే మృతి చెందాడని ఆరోపిస్తూ...మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు. వైద్యులు, వైద్య సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించి హెడ్ నర్సు రమణమ్మ చరవాణిని పగులగొట్టారు.
హెడ్నర్సు రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరదేశి నాయుడు అనే వ్యక్తితో పాటు మరికొంత మందిపై కేసులు నమోదు చేశారు. కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిపై ఇలా దురుసుగా ప్రవర్తించి, దౌర్జన్యాలకు పాల్పడటం తగదని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
ఇదీచదవండి