సీమెన్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేయబోయిన వ్యక్తిని విశాఖ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. శివాజీపాలేనికి చెందిన లక్ష్మణరావు గతంలో సీమెన్‌గా పనిచేశాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులకు షిప్పుల్లో సీమెన్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఒక్కో ఉద్యోగానికి రూ.2 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. ఇతని మాటలు నమ్మి 18 మంది విశాఖ రాగా, ఇంటర్వ్యూలు జరిపి, ఆరోగ్య పరీక్షలు చేయించాడు. ఉద్యోగంలో చేరే ముందే డబ్బులు ఇవ్వాలని వారి పాస్‌పోర్టులు తన వద్ద ఉంచుకున్నాడు.
ఓడలు బయల్దేరుతున్నాయని చెప్పి లక్ష్మణరావు డబ్బులకు ఒత్తిడి తెచ్చాడు. ఒక వ్యక్తికి అనుమానం వచ్చి ఆన్‌లైన్‌లో గంగవరం పోర్టు నుంచి బయలుదేరే ఓడల గురించి ఆరా తీశాడు. దిల్లీకి చెందిన ఓ షిప్పింగ్ కంపెనీ యాజమాన్యంతోనూ మాట్లాడాడు. తమ వద్ద ఉద్యోగాలు లేవని వారు తేల్చి చెప్పారు. దీనిపై లక్ష్మణరావును నిలదీయగా.. తాను చెప్పింది ముంబయి షిప్పింగ్ కంపెనీ అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అనుమానం వచ్చి టాస్క్‌ఫోర్స్ ఏసీపీ త్రినాథరావును సంప్రదించగా... లక్ష్మణరావు ఉంటున్న నివాసంపై దాడులు జరిపారు.
లక్ష్మణరావు వద్ద ఉన్న 18 మంది పాస్‌పోర్టులు, 18 ధ్రువపత్రాలు, 11 నకిలీ నియామక ఉత్తర్వులు, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ నీళ్లపై నాలుగు రోజుల్లో నివేదిక!