మన్యం ఇలవేల్పు మత్స్య లింగేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. విశాఖ జిల్లా హుకుంపేట మండలం మత్స్యగుండంలో మత్స్యం, సర్పం రూపంలో స్వామి కొలువై ఉన్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు మొక్కులు తీర్చుకుంటూ తలనీలాలు సమర్పించారు. కొండవాగులోని కొలనులో మత్స్యాలను దర్శించుకుని పూజలు చేసి ఆహారం సమర్పించారు.
స్వామి వారిని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన విలేకరుల సంఘం ఆధ్వర్యంలో.. భక్తులకు పులిహోర, మంచినీరు ప్యాకెట్లు పంపిణీ చేశారు. భక్తుల సౌకర్యార్థం పాడేరు నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు జబర్దస్త్ బృందం ప్రత్యేక కార్యక్రమం రాత్రికి ప్రదర్శించనున్నారు.
అనకాపల్లిలో...
అనకాపల్లిలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని సిద్ధలింగేశ్వర, భోగ లింగేశ్వర, కాశీ విశ్వేశ్వర, ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని.. స్వామివారిని ప్రత్యేకంగా అభిషేకించారు.
ఇదీ చదవండి: స్వయంభూ లింగ దర్శనానికి పోటెత్తిన భక్తులు