కరోనా చికిత్స కోసం గుంటూరు నుంచి విశాఖ వచ్చిన ఓ మహిళ.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. విశాఖ జిల్లా ఎలమంచిలి సమీపాన జాతీయ రహదారిపై మంగళవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మర్రిబంద వద్ద ముందువెళ్తున్న లారీని అతివేగంతో వస్తున్న వీరి కారు ఢీ కొనడంతో.. శ్రీనివాసరావు తల్లి మోదకూరు తులసి (80) అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఎస్సై నర్సింగరావు.. మృతదేహాన్ని బయటకు తీసి క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాత్రి 8 గంటలకు స్పృహలోకి వచ్చిన శ్రీనివాసరావు.. చికిత్స కోసం తీసుకొచ్చిన తల్లిని కోల్పోయానని బోరున విలపించారు. గుంటూరులో తప్పుడు నివేదిక రావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. అక్కడే కరోనా లేదని తెలిస్తే ఇంతదూరం వచ్చేవారం కాదని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చదవండి: బెడ్ రాకెట్ గుట్టు రట్టు.. అందుబాటులో 3వేల పడకలు
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాలకు చెందిన శ్రీనివాసరావు ఆర్మీలో పనిచేస్తున్నారు. తన తల్లికి జ్వరం వచ్చి గుంటూరులో వైద్యపరీక్షలు చేయించగా.. అక్కడ కరోనా పాజిటివ్ వచ్చింది. ఎంత ప్రయత్నించినా స్థానిక ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేవు. ఐఎన్‌ఎస్ కళ్యాణిలో బెడ్ దొరకడంతో.. వైద్యం చేయించడానికి రెండు రోజుల కిందట కారులో విశాఖ తీసుకువచ్చారు. మళ్లీ ఇక్కడ కొవిడ్ పరీక్షలు చేయించగా నెగిటివ్ రావడం, జ్వరం తగ్గిపోవడంతో.. మంగళవారం ఉదయం స్వగ్రామానికి తిరుగు ప్రయాణ మయ్యారు. ఈ క్రమంలోనే కారు ప్రమాదానికి గురై నుజ్జయ్యింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఇదీ చదవండి: