విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో 116 వివిధ గిరిజన సంక్షేమ పాఠశాలు ఉన్నాయి. వాటిలో 50 వేలమంది పైగా గిరి విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరిలో 6వేల మంది వరకు పదో తరగతి వారే ఉన్నారు. అయితే లాక్డౌన్తో విద్యా సంవత్సరం ముగిసే సమయంలో విద్యార్థులు గూడాలకు పరిమితమయ్యారు. ఇళ్లకు వెళ్లిన తర్వాత వారి విద్యా విషయాలు మరిచిపోయి ఇంటి పనుల్లో తీరిక లేకుండా పనిచేసుకుంటున్నారు.
ఏ గ్రామంలో చూసినా విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఎదో పనిలో ఉండిపోయారు. కొందరు గుడిసెలు నిర్మాణానికి మట్టి తొక్కుతున్నారు. మరికొందరు మొక్కలు నాటడం, పశువులు కాసే పనుల్లో ఇలా తలో చెట్టూ పుట్టా అన్నట్లు కనిపిస్తున్నారు. ప్రభుత్వం దూరదర్శన్, రేడియోల్లో పదో తరగతి పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఏజెన్సీ మారుమూల చాలా మందికి టీవీలు లేక పోవడంవల్ల పాఠాలకు కొందరు విద్యార్థులు దూరమయ్యారు. ఆశ్రమాల్లో గుడ్లు, మాంసం, పాలుతో కూడిన పౌష్టికాహారం పెట్టేవారు. ప్రస్తుతం చాలా మంది గంజి, అంబలితో కడుపు నింపుకుంటున్నారు.