విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో ఈ నెల 17న మూడో విడతలో జరగబోయే స్థానిక ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. పాడేరు డివిజన్ పోలీస్ అధికారి రాజ్ కమల్ ఆదేశాల మేరకు మన్యంలో భారీగా పోలీస్ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను.. సమీపంగా ఉండే పోలింగ్ బూత్‌లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసి.. ఓటింగ్ సౌలభ్యం కల్పిస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా ఐటీడీఏ సహకారంతో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి ఓటర్లను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పెదబయలు మండలం మారుమూల ఇంజరి, గిన్నెల కోట, జామి గూడ బూసిపుట్, బొంగరం పంచాయతీ ప్రాంతాల నుంచి.. సమీపంగా ఉండే కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు పోలీసు అధికారులు.. రాష్ట్ర ఎన్నికల అధికారికి ప్రతిపాదనలు పంపించారు. దీనికి అనుగుణంగా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. జి.మాడుగుల పోలీసుల ఆధ్వర్యంలో నుర్మతి బీఎస్ఎఫ్ ఔట్ పోస్ట్ పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. డ్రోన్లు వినియోగించి సమీప అనుమానిత ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సంతలో నిఘా ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి: రేపు రెండో దశ పంచాయతీ ఎన్నికలు.. ఎన్ని స్థానాల్లో అంటే!