విశాఖ జిల్లాలో మొత్తం 321 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇప్పుడు వీటి సంఖ్య తగ్గనుంది. ఇప్పటికే ఇందులో 7 దుకాణాల్లో వివిధ కారణాలతో విక్రయాలు జరగడం లేదు. ప్రస్తుతం అమ్మకాలు జరుగుతున్న 314 దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు దృష్టి పెట్టారు. 13 శాతం దుకాణాలు తొలగించాలని నిర్ణయించారు. ఇందులో భారీగా అద్దె చెల్లించేవి, కిలోమీటరు దూరంలో ఒకటి కన్నా ఎక్కువ ఉన్నవి, తక్కువ విక్రయాలు జరిగే షాపులతో సహా ..భద్రత పరంగా సురక్షితంకాని ప్రదేశాల్లో ఉన్న దుకాణాలను తొలగించనున్నారు.
ఎక్సైజ్ శాఖ నిర్ణయంతో విశాఖ జిల్లా వ్యాప్తంగా 42 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మద్యం దుకాణాల నిర్వహణలో జరుగుతున్న తప్పిదాలపై.. అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని దుకాణాల్లో సూపర్వైజర్లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వారిపై వేటు వేయనున్నారు. వారి స్థానంలో ప్రస్తుతం తొలగించనున్న దుకాణాల సూపర్వైజర్లకు అవకాశం కల్పించనున్నారు. రానున్న రోజుల్లో మద్యం దుకాణాల సంఖ్యను మరింత తగ్గించే దిశగా ఎక్సైజ్ శాఖ అవసరమైన చర్యలు తీసుకుంటుంది.
ఇదీ చదవండి: కేటాయింపు రూ.293 కోట్లు.. కొనుగోళ్లు రూ.698.36 కోట్లు!