విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకు ప్రజా ఉద్యమమే శరణ్యమని వివిధ కార్మిక, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు స్పష్టం చేశారు. కార్మిక సంఘాలు ఒకే అజెండా రూపొందించి పోరాడితే.. అన్నిపార్టీలూ అండగా నిలుస్తాయని ప్రకటించారు. విశాఖలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన సభలో రాజకీయ నాయకుల మధ్య విమర్శలు వేడిపుట్టించాయి.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు..
రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన రహదారిపై నిర్వహించిన బహిరంగ సభ విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదాలతో మార్మోగింది. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సభకు అఖిల పక్ష నేతలు హాజరయ్యారు. స్టీల్ ప్లాంట్ భూముల్ని అమ్మకానికి పెడితే ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పారు. ఉక్కు కర్మాగారం కోసం సొంతగనులు కేటాయించాలని గళమెత్తారు.
రాజకీయ రగడ..
సభలో పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పరస్పర విమర్శలు.. రాజకీయ రగడకు తెర లేపాయి.
ప్రధాని వద్దకు అఖిలపక్షం..
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్నిపార్టీలు పార్లమెంట్‌లో గళమెత్తాలని మంత్రి అవంతి కోరగా.. ప్రధాని మోదీ వద్దకు సీఎం అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. రాజకీయాలకు అతీతంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని కార్మిక సంఘాల నేతలు సూచించగా.. రాజకీయ నాయకులు స్వాగతించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఉక్కు ఉద్యమానికి సంబంధించిన గీతాల సీడీని సైతం విడుదల చేశారు.