Janasena chief Pawan Kalyan fires on volunteer system: జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై మరోసారి విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నవరత్నాల కోసం నియమించిన వాలంటీర్ వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలోని ప్రజల ప్రాణాలు తీస్తోందని ఆగ్రహించారు. మరికొంతమంది వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారి.. నేరాలకు తెగబడుతున్నారని దుయ్యబట్టారు. వాళ్లు (వాలంటీర్లు) చేస్తున్న దురాగతాలు కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయన్న పవన్ కల్యాణ్.. బయటకు రానివి చాలనే ఉన్నాయని మండిపడ్డారు. ఓ చిన్నపాటి ఉద్యోగానికి వెరిఫికేషన్‌ల మీద వెరిఫికేషన్‌లు చేసే ఈ జగన్ ప్రభుత్వం.. వాలంటీర్ వ్యవస్ధ విషయంలో ఎందుకు వెరిఫికేషన్ చేయడం లేదు..? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
Pawan Varahi Yatra Today Updates.. 'వారాహి విజయ యాత్ర' పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ 10 రోజులపాటు విశాఖపట్నంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు రోజుల పర్యటన పూర్తి చేసుకున్న జనసేనాని.. నేడు (మూడోవ రోజు) సింహాచలం తొలి పావంచ వద్దనున్న పంచ గ్రామాల సమస్యలపై రైతులతో చర్చించి.. వినతిపత్రాలను స్వీకరించారు. అనంతరం పెందుర్తి సుజాతనగర్‌లో ఇటీవలే వాలంటీర్ చేతిలో హత్యకు గురైన కోటగరి వరలక్ష్మి కుటుంబాన్ని పవన్ కల్యాణ్ పరామర్శించారు. పరామర్శలో భాగంగా వృద్దురాలి కొడుకు.. తన తల్లిని వాలంటీర్ పిడి గుద్దులు గుద్ది.. పీక నులిమి, అత్యంత భయానకంగా హతమర్చాడని, ఆమె నివసిస్తున్న ప్రాంతానికి దగ్గరలోనే ఉన్నప్పటికీ అమ్మను కాపాడుకోలేకపోయామని పవన్ కల్యాణ్ ముందు కన్నీటి పర్యంతమయ్యారు.
Pawan Kalyan comments.. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..''పదిరోజుల క్రితం బంగారు ఆభరణాల కోసం ఒంటరి వృద్ధురాలిని ఓ వాలంటీర్ అతి కిరాతకంగా హత్య చేశాడని తెలిసి.. తీవ్ర ఆవేదనకు గురయ్యాను. వృద్ధురాలి కొడుకు పడుతున్న ఆవేదన చూసి, కడుపు తరుక్కు పోతోంది. విశాఖలో హత్య జరిగి పది రోజులు కావొస్తున్న ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఒక్క నాయకుడు కూడా పరామర్శకు రాలేదు. అంటే వాళ్ల ఆలోచన విధానం ఏంటో స్పష్టంగా అర్ధమవుతుంది. వాలంటీర్ల ముసుగులో కొందరు చేస్తున్న దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయు. వాలంటీర్లపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో వారు రెచ్చిపోతున్నారు. ఇదొక దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైంది. ఇళ్లలోకి చొరబడి మరీ సమాచారం సేకరిస్తున్నారంటే.. వారు ఎలాంటివారో తెలుసుకోకుండా వారిని నియమించడం ఎంతవరకు సబబు.'' అని ఆయన అన్నారు.
Pawan fires on Visakha MP.. వైసీపీ నాయకులు రౌడీలతో మిలాఖత్ అయిపోయారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ఎంపీ కుటుంబానికి రక్షణ లేకుండా పోయిందన్న పవన్.. డబ్బు కోసం కొడుకు, భార్యను కిడ్నాప్ చేసిన రౌడీలనే ఎంపీ వెనకేసుకురావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ఇంట్లో సొంత మహిళలపై దాడి చేసే వారిని వెనకేసుకొచ్చే ఎంపీ..ఎలాంటి ఎంపీనే ప్రజలు గ్రహించాలన్నారు. కిడ్నాప్ చేసిన రౌడీలకు ఎంపీ భయపడి, వారికి వత్తాసు పలుకుతున్నాడంటే ఎంతటి అసమర్థుడో అర్ధం చేసుకోవాలన్నారు. డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసి, అధికారంలోకి వస్తే ధైర్యం ఎక్కడ నుంచి వస్తుందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక.. దాదాపు 30వేల మంది మహిళలు అదృశ్యమైపోయారని నేను మాట్లాడితే, నా మీద ఈ వైసీపీ నాయకులు తెగ విరుచుకుపడ్డారు. తాజాగా పార్లమెంట్ సాక్షిగా నేను చెప్పింది నిజమని తేలింది. ఉత్తరాంధ్ర నుంచి 155 మంది చిన్న పిల్లలు అదృశ్యమైపోయారు. ఇది నేను చెబుతున్నది మాట కాదు.. స్వయానా నోబుల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి చెప్పిన మాట. చిన్నారుల అక్రమ రవాణాకు మూలం ఏమిటో..?, మాయం అవుతున్న చిన్నారులు ఏమవుతున్నారో..? కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి పట్టడం లేదు.-పవన్ కల్యాణ్, జనసేన అధినేత