జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ బెల్లం మార్కెట్‌లో... శుక్రవారం రికార్డుస్థాయిలో బెల్లం ధరలు పలికాయి. వంద కిలోల స్పెషల్ రకం బెల్లం ధర 5 వేల 50 రూపాయలకు అమ్ముడైంది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న మార్కెట్‌లో ఇంత ధర ఎప్పుడూ పలకలేదని వ్యాపారులు తెలిపారు. రంగు బెల్లాలు సరాసరి 100 కేజీలు 4,472 రూపాయలు, మధ్య రకం 3,570 రూపాయలుగా ఉంది. అలాగే నాసి రకాలు సైతం 3,410 రూపాయలుగా అమ్మకాలు సాగాయి. డిమాండ్కు తగ్గ సరకు మార్కెట్ యార్డుకు రాకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని వర్తకులు తెలిపారు. జిల్లా రైతులు ఇంకా కొత్త బెల్లం తయారీ పూర్తిస్థాయిలో చేపట్టకోపోవటంతో ధరలు పెరిగినట్లు వెల్లడించారు.
ఈ ఏడాది సకాలంలో వర్షాలు లేక చెరకు పంట పక్వ దశకు చేరలేదని రైతులు అంటున్నారు. పంటకు తెగుళ్లు సోకటంతో దిగుబడులు తగ్గిపోయాయి. అయినప్పటికీ ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బంగా, ఒడిశా రాష్ట్రాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండడం ధరల పెరుగుదలకు కారణంగా వ్యాపారులు పేర్కొన్నారు.