HC ON HAYAGREEVA CONSTRUCTION WORKS : విశాఖ జిల్లా ఎండాడ గ్రామ పరిధిలోని హయగ్రీవ ఫార్మ్స్, డెవలపర్స్ సంస్థ చేపడుతున్న నిర్మాణ పనులను నిలిపి వేయాలని విశాఖ మహా నగర పాలక సంస్థ(GVMC) కమిషనర్ 2023 ఫిబ్రవరి 15న నోటీసులు జారీ చేశారు. అయితే కమిషనర్ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ విచారణ జరిపారు.
రెండు వారాల్లో ఉత్తర్వులుపై జీవీఎంసీ కమిషనర్‌కు వివరణ ఇవ్వాలని హాయగ్రీవ సంస్థను ఆదేశించారు. వివరణ అందుకున్న తర్వాత దానిని పరిగణనలోకి తీసుకొని మూడు వారాల్లో తుది ఉత్తర్వులు జారీ చేయాలని జీవీఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. ఆ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు.. నిర్మాణ పనులను నిలిపేయాలంటూ కమిషనర్ జారీ చేసిన నోటీసును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక మీదట హయగ్రీవ చేపట్టే నిర్మాణ పనులు జీవీఎంసీ కమిషనర్ జారీ చేయబోయే తుది ఉత్తర్వులకు లోబడే ఉంటాయని తేల్చి చెప్పారు. తదుపరి పర్యావసానాలను హయగ్రీవ సంస్థ ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తూ వ్యాజ్యాన్ని పరిష్కరించారు.
విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలో హయగ్రీవ ఫార్మ్స్, డెవలపర్స్ 12.51 ఎకరాల్లో నిర్మాణాలు చేపడుతోంది. ఆ నిర్మాణాలపై అభ్యంతరం తెలుపుతూ జీవీఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేస్తూ.. పనులను నిలిపేయాలని అని సూచించారు. జిల్లా కలెక్టర్ జారీ చేసిన నిరభ్యంతరపత్రం సమర్పించలేదని, మాస్టర్ ప్లాన్ ప్రకారం 60 అడుగులు రహదారి కల్పించలేదనే కారణాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. హయగ్రీవ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన న్యాయమూర్తి.. కమిషనర్ ఉత్తర్వులను సస్పెండ్ చేశారు. కమిషనర్‌కు వివరణ ఇవ్వాలని హయగ్రీవను ఆదేశించారు.
మరోవైపు ఎండాడ గ్రామంలో హయగ్రీవ ఫార్మ్స్, డెవలపర్స్‌కు కేటాయించిన సర్వే నంబరు 92/3లోని 12.51 ఎకరాలను వెనక్కి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే, విశాఖ టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. అయితే దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాల్లో కౌంటర్ దాఖలు చేయకుండా, కోర్టుతో దాగుడుమూతలు ఆడుతున్నారా? అని హైకోర్టు ఘాటుగా ప్రశ్నించింది. ఈ విషయంలో ఏదో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేసింది. ఆ విచారణను నేటికి వాయిదా వేస్తూ.. జీవీఎంసీ కమిషనర్‌ను తప్పకుండా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై నేడు విచారణ జరగనుంది.
ఇవీ చదవండి: