విశాఖ జిల్లాలోని ఆరు పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ నిలిచింది. పంచాయతీల విభజనలపై.. ఆయా ప్రాంతాల ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. అక్కడ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే ఇచ్చింది.
జిల్లాలోని రాంబిల్లి మండలం పంచదార్ల, అప రాయుడుపాలెం, జెడ్ చింతువా, ఎన్ చింతువా గ్రామాలతో పాటు... నక్కపల్లి మండలంలోని దోసలపాడు, షిరిడి గ్రామాలు ఉన్నాయి. 2019 డిసెంబర్ 31 నుంచి 2020 జనవరి 20 వరకు ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు ప్రభుత్వం పంచాయతీలను విభజించింది. ఈ విధంగా జిల్లాలోని 13 పంచాయతీల్లో కొన్ని గ్రామాలను విభజించి.. కొత్తగా 50 పంచాయతీలు ఏర్పాటు చేసింది.
అయితే రాంభిల్లి మండలం పంచదార్ల, దోశలుపాడు పంచాయతీల విభజనపై ఆయా గ్రామాలకు చెందిన కొందరు న్యాయస్థానానికి వెళ్లగా.. ఎన్నికలపై ఆయా ప్రాంతాల ఎన్నికలపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.
హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున.. ఎన్నికలను ఆయా ప్రాంతాల్లో నిలుపుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రస్తుతం రాంబిల్లి, నక్కపల్లి మండలంలో 6 పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ నిలిచింది.
కడప జిల్లాలో...
కడప జిల్లాలోని 13 గ్రామ పంచాయతీ ఎన్నికలను హైకోర్టు స్టే ఇచ్చింది. పంచాయతీల విభజన, నగర పంచాయతీల్లో విలీనం వంటి వాటిపై సంబంధిత గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించటంతో.. ధర్మాసనం ఎన్నికలపై స్టే ఇచ్చింది.
సంబేపల్లి మండలంలో మూడు పంచాయతీలు, పుల్లంపేటలో రెండు, రైల్వే కోడూరులో రెండు, సుండుపల్లెలో రెండు, వల్లూరు మండలంలో రెండు, నందలూరు, కమలాపురలం పంచాయతీల్లో ఒకటి చొప్పున ఎన్నికలు నిలిచాయి. హైకోర్టు స్టే విషయాన్ని జిల్లా అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లగా.. ధర్మాసనం ఆదేశాల మేరకు 13 పంచాయతీల్లో ఎన్నికలు నిలిపివేశారు.
ఇదీ చదవండి: ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్‌లో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు