విశాఖ జిల్లా అనకాపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన 50 ఎకరాల భూమిని వైద్య కళాశాల(medical collage) ఏర్పాటు కోసం బదిలీ చేయవద్దని అధికారులకు హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు యథాతథ స్థితి పాటించాలని ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. వ్యాజ్యంపై విచారణను ఈ నెల 27 కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
వైద్య కళాశాల ఏర్పాటు కోసం అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ కు చెందిన 50 ఎకరాల భూ కేటాయింపునకు సంబంధించి 2020 నవంబర్ 13న రెవెన్యూ శాఖ జారీచేసిన జీవో 351ని రద్దు చేయాలని కోరుతూ జర్నలిస్ట్ కె.వెంకటరమణ హైకోర్టులో పిల్ వేశారు. న్యాయవాది బొజ్జా అర్జున్ రెడ్డి వాదించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ బోర్డు.. భూ కేటాయింపును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిందన్నారు. ఇదే తరహాలో సంద్యాలలోని వ్యవసాయ పరిశోధన కేంద్రం భూముల కేటాయింపుపై హైకోర్టు గతంలోనే స్టే ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వం తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదినలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం భూబదలాయింపుపై యథాతథ స్థితి ఉత్తర్వులు జారీచేసింది.
ఇదీ చదవండి:
AOB Villagers: 'మమ్మల్ని గుర్తించండి.. దయచేసి ఆంధ్రప్రదేశ్లో కలిపేయండి'