విశాఖ మన్యం అంటే కాఫీ తోటలు గుర్తుకొస్తాయి. దేశ వ్యాప్తంగా కాఫీ సాగులో కేరళ, తమిళనాడు, కర్నాటక తర్వాత సంప్రదాయేతర ప్రాంతం అయినప్పటికీ కాఫీ సాగులో ఏపీ ముందంజలో ఉంది. మన్యంలో పోడు వ్యవసాయం పేరిట గిరిజనులు అడవులను నరికేస్తుండటంతో అటవీ ప్రాంతం తగ్గుతోందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వాటిని సంరక్షించే లక్ష్యంతో కాఫీ తోటల విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఐటీడీఏలు కాఫీ సాగును ప్రోత్సహిస్తున్నాయి. తద్వారా అడవుల పరిరక్షణతోపాటు గిరిజనుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో కొత్తగా పలువురు రైతులు కాఫీ సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
అనుకూల వాతావరణ పరిస్థితులతో..
కాఫీ దీర్ఘకాలిక పంట. ఈ మొక్క జీవితకాలం 50 ఏళ్లు. నాటిన ఐదేళ్ల నుంచి దిగుబడి వస్తుంది. కాఫీ దిగుబడులు వాతావరణ పరిస్థితులపైనే ఆధారపడి ఉంటాయి. సారవంతమైన భూమి, తగినంత సూర్యరశ్మి, వర్షపాతం, తేమ వాతావరణం కాఫీ సాగుకు అనుకూలం. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎండ వాతావరణం అధికంగా ఉన్నప్పటికీ ఆ సమయంలో కురిసే వర్షాలకు కాఫీ తోటలు మేలు చేస్తాయి. కాఫీ మొక్కలకు పూసిన పూలు పిందెలుగా మారతాయి.
కాఫీ సాగుతో జీవితం మారిపోయింది
కాఫీ సాగు ద్వారా గిరిజన రైతుల జీవితాలు మారిపోయాయి. వరి, మొక్కజొన్న, రాగులు, రాజ్‌మా కంటే.. కాఫీ, మిరియాల సాగుతో ఎక్కువ ఆదాయం వస్తోంది. ఉపాధి హామీ పథకంలో కాఫీ తోటల పెంపకం రైతులకు కలిసొస్తోంది.- - సెగ్గె కొండలరావు, అధ్యక్షుడు, కాఫీ రైతు సంక్షేమ సంఘం, చింతపల్లి
ఆరేళ్లలో అనేక మార్పులు
హుద్‌హుద్ తర్వాత ఆరేళ్లలో వాతావరణలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అదనులో వర్షాలు పడకపోవడంతో ఈ ఆరేళ్లలో ఆశించిన దిగుబడులు రాలేదు. 2015-16లో 6,700 టన్నుల దిగుబడి రాగా.. 2019-20లో 10,300 టన్నుల దిగుబడి వచ్చింది.- - రాధాకృష్ణ, ఏడీ, కాఫీ ప్రాజెక్టు, ఐటీడీఏ
ఇదీ చదవండి: హక్కులు హరించేలా పోలీసు వ్యవస్థ తీరు ఉంది: వర్లరామయ్య