ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గిరిజనం భయాందోళనకు గురవుతున్నారు. మావోయిస్టు వారోత్సవాలతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. నేటి నుంచి వారం రోజుల పాటు జరగబోయే పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు అడవుల్లో జల్లేడ పడుతున్నారు. గత ఏడాది మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల సమయంలో అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలను లివిటుపుట్టు వద్ద మావోయిస్టులు కాల్చిచంపారు. ఆ ఘటనతో ఈ వారోత్సవాలను పోలీసులు తేలిగ్గా తీసుకోవడం లేదు. ఇందులో భాగంగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
వారోత్సవాలు సందర్భంగా సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థతి నెలకొంది. చిత్రకొండ, కలిమెల, కోరుకొండ, బ్లాక్‌ల పరిధిలో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. దుకాణాలు మూతబడ్డాయి. వాహనాలు నిలిచిపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా సరిహద్దు కూడలిలో తనిఖీలు చేపడుతున్నారు. కొత్త వ్యక్తులు కదలికలు మీద నిఘా ఉంచారు. మన్యంలోని కొయ్యూరు, చింతపల్లి, గూడెంకొత్తవీధి, జి.మాడుగుల, పెదబయలు, ముంచింగ్‌పుట్టు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరుకులోయ ప్రాంతాల్లో పోలీసులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. సరిహద్దుల్లో ఉన్న అవుట్‌పోస్టులలో అదనపు బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో ఎప్పడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి: మన్యంలో ఉద్రిక్త వాతావరణం..!