GVMC PLAN FOR RUSHIKONDA : విశాఖపట్నం రుషికొండలో పర్యాటక శాఖ చేపట్టిన వివాదాస్పద నిర్మాణాలకు మహా విశాఖ నగరపాలక సంస్థ(GVMC) ప్రణాళికలు మంజూరు చేసింది. ఫిబ్రవరి 27న రాత్రి సంబంధిత దరఖాస్తుకు కమిషనర్ రాజాబాబు ఆమోదం తెలిపారు. అయితే నిర్మాణాలు పూర్తవుతున్న నేపథ్యంలో దీన్ని మంజూరు చేయడం గమనార్హం. జీవీఎంసీకి.. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ కార్య నిర్వాహక ఇంజినీర్ రమణ పంపిన మొదటి ప్లానులో 12.46 ఎకరాలకు గాను 9.88 ఎకరాల్లో నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు. దీనిపై విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో కేసు వేశారు.
దానికి కౌంటరుగా సీఆర్‌జడ్, పర్యావరణ అనుమతులున్న 2.88 ఎకరాల్లో మాత్రమే నిర్మాణాలు చేపడతామని హైకోర్టుకు పర్యాటకశాఖ తెలిపింది. అయితే దానికి విరుద్ధంగా కొత్త ప్లాన్‌ను రూపొందించారు. ఇందులో 69.64 ఎకరాలకు గాను ఏకంగా 61.03 ఎకరాల్లో నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు. న్యాయస్థానానికి వివరించిన ప్రకారం ప్రస్తుతం 2.88 ఎకరాల్లో నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ భవిష్యత్తులో మరింత విస్తరించాలనే వ్యూహంతో మొత్తం ప్రణాళికను మార్చేశారు.
ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్న లెక్కచేయని ప్రభుత్వం: రుషికొండపై నిర్మాణాలకు సంబంధించి జీవీఎంసీకి రూ.19.05 కోట్ల భవన నిర్మాణ రుసుములను ఐదు సంవత్సరాల్లో దశల వారీగా చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాన్‌లో కళింగ, వేంగి, గజపతి, విజయనగరం బ్లాకులలో గ్రౌండ్, మొదటి అంతస్తుల నిర్మాణానికి అనుమతి కోరారు. కళింగ 7266.32 చదరపు మీటర్లు, వేంగి రెండు బ్లాకులు కలసి 1713.22 చదరపు మీటర్లు, గజపతి 903.34 చదరపు మీటర్లు, విజయనగరం పేరుతో మూడు బ్లాకులను 1198.52 చదరపు మీటర్లలో నిర్మించనున్నట్లు వివరించారు. మరోవైపు రుషికొండను పూర్తిగా ధ్వంసం చేస్తున్నారంటూ ప్రజాసంఘాల ప్రతినిధులు, ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఏ మాత్రం లెక్క చేయకుండా నిర్మాణాలు కొనసాగిస్తోంది.
హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు: విశాఖలోని రుషికొండను పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్ట్ అభివృద్ధి పేరుతో విచక్షణా రహితంగా తవ్వేస్తూ, పరిధిని దాటి నిర్మాణాలు చేస్తున్నారని తెలుపుతూ జనసేన కార్పొరేటర్ పీవీఎల్ఎన్ మూర్తి యాదవ్, విశాఖ తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. అధికార పార్టీ ఎంపీ రఘురామ సైతం తన వాదనలు వినాల్సిందిగా ఇంప్టీడ్ పిటిషన్ వేశారు.
అయితే ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు.. ఎంవోఈఎఫ్ ఏర్పాటు చేసిన కమిటీలో ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన వారు ఉండటంపై విస్మయం వ్యక్తం చేసింది. ఇష్టారాజ్యంగా కొండను తవ్వేశారని ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటున్నదున నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులకు కమిటీలో స్థానం ఎలా కల్పిస్తారని నిలదీశింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన అధికారులతో కమిటీ వేయాలని తేల్చిచెప్పింది.
ఇవీ చదవండి: