Comments of BJP Leaders on YS Jagan: జగనన్నే మా భవిష్యత్ అంటే ప్రజల భవిష్యత్ పూర్తి అంధకారం కావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.విష్ణుకుమార్ రాజు విమర్శించారు. విశాఖలో వైఎస్సార్సీపీ నేతలు భూములు దోచుకున్నారని ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇస్తామని చెప్పినందున.. ఎమ్మెల్యేలకు మాత్రమే జగన్‌పై నమ్మకం ఉందన్నారు.
జగన్ దోచుకున్న సొమ్ము రూ.50 వేల కోట్ల పై మాటేనని విష్ణుకుమార్ చెప్పారు. మద్యం ద్వారా వేల కోట్లు ప్రజా సొమ్ము దోచుకున్నారని, రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి చేరుకుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బండారం బయట పడుతుందన్నారు. ఆంధ్రాలో బీజేపీ బలోపేతానికి పార్టీలో కొత్తగా చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కృషి చేస్తారన్నారు. ఈ సందర్భంగా 'జగనన్నే మా భవిష్యత్ అయితే.. ప్రజల భవిష్యత్ అంధకారమే' అనే ప్లకార్డులు ప్రదర్శించారు.
"మా నమ్మకం నువ్వే జగన్ అని మనం చెప్పడం లేదు.. వాళ్ల ఎమ్మెల్యేలు చెప్తున్నారు. వాళ్లకు మాత్రం జగన్ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే సంవత్సరంలో ఒక్కో ఎమ్మెల్యేకు 50 కోట్ల రూపాయలు ఇస్తారట. కాబట్టి వాళ్లకి ప్రస్తుతానికి నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి దోచుకున్న డబ్బు.. ఈ నాలుగేళ్లలో కనీసం 50 వేల కోట్లు ఉంటుంది. మద్యం ద్వారా కోట్ల రూపాయలు దోచుకున్నారు". - పి.విష్ణుకుమార్ రాజు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు
జీవీఎల్ నరసింహారావు విమర్శలు: రాష్ట్ర ప్రజల సొమ్ము వారికే ఇస్తూ, జగనన్నే మా భవిష్యత్ అనడం సరికాదని, జగన్ దాన వీర శూర కర్ణ కాదు, జగన్‌ది అహంకారం అనుకోవాల్సి ఉంటుందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ప్రజలు ఓడిస్తారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తూ తమ స్టిక్కర్లు వేసుకుంటున్నారని.. ఇప్పుడు ప్రజల సొంత ఆస్తులకు కూడా స్టిక్కర్లు వేయడం ఏమిటని నిలదీశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం దిశగా అడుగులు వేస్తుందన్నారు.
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికను స్వాగతిస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్నారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని తెలంగాణ పర్యటన రెండు తెలుగు రాష్ట్రాలకు శుభసూచకం అన్నారు. సికింద్రాబాద్- తిరుపతికి వందే భారత్ రైలు ప్రారంభం వల్ల ఇక్కడ ప్రజలకు వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి వచ్చిందన్నారు.
ఇవీ చదవండి: